చమురు లీకేజీ ప్రభావం..షార్జాలో అన్ని బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత

- October 28, 2026 , by Maagulf
చమురు లీకేజీ ప్రభావం..షార్జాలో అన్ని బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత

సముద్ర కాలుష్య నివారణకు అధికారుల చర్యలు.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు

షార్జా: యూఏఈ తీర ప్రాంతంలో చమురు లీకేజీ ఘటన నేపథ్యంలో సముద్ర కాలుష్యాన్ని నివారించేందుకు షార్జా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమిరేట్ పరిధిలోని అన్ని బీచ్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సముద్రంలో ఉన్న చమురు తీర ప్రాంతాలకు చేరకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

బీచ్‌ల భద్రతను నిర్ధారించడంతో పాటు సముద్ర కాలుష్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు అవసరమైన చర్యలు చేపడుతున్నాయని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి

బీచ్‌లకు వెళ్లే ప్రజలు, పర్యాటకులు, సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే సందర్శకులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక సమాచార మార్గాలను మాత్రమే అనుసరించాలని, నిర్ధారణ కాని వార్తలు, వదంతులను ప్రచారం చేయవద్దని సూచించారు.

అక్టోబర్ 23న ముందస్తు జాగ్రత్త చర్యగా అల్ హమ్రియా బీచ్‌ను మొదట మూసివేశారు. తాజాగా సముద్ర కాలుష్య ముప్పును దృష్టిలో ఉంచుకుని షార్జా ఎమిరేట్ పరిధిలోని అన్ని బీచ్‌లకు ఈ ఆంక్షలను విస్తరించారు.

ఉమ్ అల్ ఖువైన్ తీరంలో చమురు లీకేజీ

యూఏఈలోని పలు ఎమిరేట్లలో నివసిస్తున్న ప్రజలు వరుసగా మూడు రోజుల పాటు ఇంధనం వాసనను పోలిన ఘాటైన వాసన వస్తోందని ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన యూఏఈ వాతావరణ మార్పులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ.. ఉమ్ అల్ ఖువైన్ తీరానికి సమీపంలో జరిగిన చమురు లీకేజీ వల్లే ఈ వాసన వస్తున్నట్లు నిర్ధారించింది.

ఈ నేపథ్యంలో ఉమ్ అల్ ఖువైన్‌లోని అన్ని బీచ్‌లు, తీర ప్రాంతాలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. సాంకేతిక బృందాలు సమగ్ర పరిశీలనలు పూర్తి చేసి, సముద్ర పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలను గుర్తించే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

రాస్ అల్ ఖైమాలోనూ బీచ్‌లు మూసివేత

చమురు లీకేజీ ఘటన పై ఆందోళనల నేపథ్యంలో రాస్ అల్ ఖైమా ప్రభుత్వం కూడా తన పరిధిలోని అన్ని బీచ్‌లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

సముద్ర జలాల నాణ్యత, తీర ప్రాంతాల భద్రతపై అధికారులు అంచనాలు నిర్వహిస్తున్నారు. సాంకేతిక బృందాల పరిశీలనలు పూర్తయిన తర్వాతే బీచ్‌లను తిరిగి తెరిచే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

స్థానిక చేపల వేటకు తాత్కాలిక విరామం

చమురు లీకేజీ ప్రభావంతో ఉమ్ అల్ ఖువైన్‌లో స్థానిక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో చేపల వేట తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే, స్థానిక చేపల మార్కెట్‌లో తాజా చేపల సరఫరాకు కొరత లేదని వ్యాపారులు తెలిపారు.

ఒమన్ నుంచి ప్రతిరోజూ తాజా చేపలు మార్కెట్‌కు వస్తున్నాయని, సాధారణంగా అందుబాటులో ఉండే చాలా రకాల చేపలు విక్రయానికి ఉన్నాయని వెల్లడించారు.

సముద్ర కాలుష్యం పై సాంకేతిక బృందాల అంచనాలు పూర్తయ్యే వరకు బీచ్‌ల మూసివేత కొనసాగనుంది. ఘటనకు సంబంధించిన తదుపరి వివరాలు, కాలుష్య నివారణ చర్యల పై అధికారిక ప్రకటనల ద్వారా సమాచారం అందిస్తామని యూఏఈ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com