స్పెయిన్‌లో ఘోర రైళ్లు ప్రమాదం..68 మంది దుర్మరణం
- October 28, 2026
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు హైస్పీడ్ రైళ్లు పరస్పరం ఢీకొనడంతో కనీసం 50 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే స్పెయిన్ ప్రభుత్వ అధికారులు ప్రాథమికంగా పది మంది మృతి చెందారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో వందకు పైగా గాయపడినట్లు సమాచారం. ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మోరా–ఒర్గాజ్ పట్టణాల మధ్య ప్రమాదం
స్పెయిన్‌లోని టోలెడో సమీపంలో, మోరా–ఒర్గాజ్ పట్టణాల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే ఆపరేటర్ అడిఫ్ (Adif) వెల్లడించింది. మాడ్రిడ్ నుంచి దక్షిణ స్పెయిన్‌లోని సెవిల్లె వైపు వెళ్తున్న రైళ్లు ఈ ఘటనలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ రెన్ఫే (Renfe) నిర్వహిస్తున్న రైలు, ప్రైవేటు సంస్థ ఇరియో (Iryo) నిర్వహిస్తున్న రైలు ప్రమాదానికి గురైనట్లు ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
పట్టాలు తప్పిన రెండు బోగీలు
ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత) ఈ ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇరియో రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది? రైళ్లలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
రైళ్ల రాకపోకలు నిలిపివేత
ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్–అండలూసియా హైస్పీడ్ రైల్వే మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అడిఫ్ ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
ఆరోగ్య మంత్రి ఏమన్నారు?
స్పెయిన్ ఆరోగ్య మంత్రి మోనికా గార్సియా ప్రమాద స్థలానికి సంబంధించిన దృశ్యాలు తీవ్రతను తెలియజేస్తున్నాయని అన్నారు. దేశం ఒక పెద్ద విషాదాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమందికి అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ చికిత్స అవసరం? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు.
సహాయక చర్యలు ముమ్మరం
ప్రమాద సమాచారం అందిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించి ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. క్షతగాత్రులకు సహాయం అందించేందుకు సమీపంలోని ఉర్దా పట్టణంలో క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని అత్యవసర సేవల అధికారులు స్థానిక యంత్రాంగాన్ని కోరారు.
కాస్టిల్లా-లా మంచా ప్రాంతీయ ప్రభుత్వం అత్యవసర ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సివిల్ ప్రొటెక్షన్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. క్షతగాత్రుల పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్‌లో ఘోర రైళ్లు ప్రమాదం..68 మంది దుర్మరణం
- వరద సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
- చమురు లీకేజీ ప్రభావం..షార్జాలో అన్ని బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత
- జయేశ్ రంజన్ బదిలీ
- ఏపీకి మరో 7 రోజుల పాటు భారీ వర్ష సూచన
- యూఏఈలో ఆరోగ్య రంగ ప్రముఖులకు ఘన సత్కారం
- రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!
- ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- కువైట్‌లో విదేశీ ఇంజినీర్లకు ఊరట..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక టవర్..!!







