ఒమన్ లో మానవ అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక చర్యలు..!!

- October 30, 2026 , by Maagulf
ఒమన్ లో మానవ అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక చర్యలు..!!

మస్కట్: ఒమన్‌కు ఉపాధి కోసం వచ్చే కార్మికులకు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైనప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించేందుకు వీలుగా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక అవగాహన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మానవ అక్రమ రవాణా నిరోధక జాతీయ కమిటీ (NCCHT) ఆధ్వర్యంలో విమానాశ్రయం రాకపోకల మార్గంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్మికుల హక్కులపై అవగాహన పెంచడం, మానవ అక్రమ రవాణా నేరాలను అరికట్టడం, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడటం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కమిటీ తెలిపింది.  

రెండు దశల్లో అవగాహన కార్యక్రమం

ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో భాగంగా కమిటీ అధికారిక వెబ్‌సైట్‌కు అనుసంధానించిన డిజిటల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 13 భాషల్లో కార్మికుల హక్కులు, బాధ్యతలు, ఉపాధి సంబంధిత నిబంధనలపై అవగాహన సమాచారాన్ని అందిస్తారు. వివిధ దేశాల రాయబార కార్యాలయాల సంప్రదింపు నంబర్లు, కమిటీ హెల్ప్‌లైన్ వివరాలను కూడా అందుబాటులో పెడతారు. మొదటి దశలో డిజిటల్ స్క్రీన్ ద్వారా సమాచారం, మార్గదర్శకాలను అందించడానికే పరిమితం కానున్నారు.

 రెండో దశలో ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగిని ఈ కార్యాలయంలో నియమిస్తారు. ఆయన వచ్చే కార్మికులతో నేరుగా మాట్లాడి, వారి యజమాని పేరు, అంగీకరించిన వేతనం వంటి ప్రాథమిక ఉపాధి వివరాలను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా కార్మికులకు వారి హక్కులు, బాధ్యతలు, పని పరిస్థితులపై అవగాహన కల్పిస్తారని మానవ అక్రమ రవాణా నిరోధక జాతీయ కమిటీ వైస్ చైర్మన్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ సెర్చ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జమాల్ బిన్ హబీబ్ అల్ ఖురైషీ తెలిపారు.  

ఒమన్ కార్మికుల జనరల్ ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్, జాతీయ కమిటీ సభ్యుడు జాసిమ్ బిన్ హమూద్ అల్ మాల్కీ మాట్లాడుతూ.. కార్మికుల రక్షణ ఉల్లంఘనలు జరిగిన తర్వాత ప్రారంభం కాకూడదని, వారు తమ హక్కులను తెలుసుకున్న క్షణం నుంచే మొదలవ్వాలని అన్నారు. సరైన సమాచారం, అధికారులను సంప్రదించే సురక్షిత మార్గాలపై అవగాహన కల్పించడం ద్వారా దోపిడీని ముందుగానే అరికట్టవచ్చని వివరించారు. కార్మికులకు తమ భాషలో అధికారిక, విశ్వసనీయ సమాచారం అందించడం ఈ కేంద్రం ప్రత్యేకతగా నిలుస్తుందని తెలిపారు. యజమానులు లేదా రిక్రూట్‌మెంట్ మధ్యవర్తులపై మాత్రమే ఆధారపడకుండా, ప్రభుత్వ అధికారిక వనరుల ద్వారా తమ హక్కులను తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com