జీసీసీ దేశాల ఐక్యతకు సైనికాధిపతుల పిలుపు..!!

- October 30, 2026 , by Maagulf
జీసీసీ దేశాల ఐక్యతకు సైనికాధిపతుల పిలుపు..!!

దోహా: గల్ఫ్ ప్రాంతం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవాలని గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల సైనికాధిపతులు స్పష్టం చేశారు. ప్రాంతంలో చోటుచేసుకుంటున్న “దూకుడు చర్యలు” సహా వివిధ సవాళ్ల నేపథ్యంలో సభ్యదేశాల మధ్య ఐక్యత, సమన్వయం, ఉమ్మడి కృషి అవసరమని వారు పేర్కొన్నారు. బహ్రెయిన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ థియాబ్ బిన్ సఖర్ అల్ నుఐమీ అధ్యక్షతన జీసీసీ సుప్రీం మిలిటరీ కమిటీ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ 23వ సమావేశం జరిగింది. ఈ ఉన్నతస్థాయి సమావేశానికి గల్ఫ్ సహకార మండలిలోని పలు దేశాల సీనియర్ సైనిక అధికారులు హాజరయ్యారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్ దేశాల సైనికాధిపతులతో పాటు జీసీసీ జనరల్ సెక్రటేరియట్, యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

లెఫ్టినెంట్ జనరల్ అల్ నుఐమీ మాట్లాడుతూ.. బహ్రెయిన్ రాజు, సాయుధ దళాల సుప్రీం కమాండర్ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా నాయకత్వంలో సమష్టి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రక్షణ రంగంలో సమన్వయాన్ని పెంపొందించడం, జీసీసీ దేశాల మధ్య సంయుక్త సైనిక సహకారాన్ని విస్తరించడంపై నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లు, అసాధారణ దూకుడు చర్యల నేపథ్యంలో జీసీసీ దేశాల భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు పూర్తి ఐక్యతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ముప్పులను ఎదుర్కొనేందుకు సభ్యదేశాల మధ్య సన్నిహిత సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో భాగంగా సభ్యదేశాల సాయుధ దళాల మధ్య సైనిక సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడం, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పలు అజెండా అంశాలపై చర్చించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com