కెనడా వీసా అపాయింట్‌మెంట్లపై VFS గ్లోబల్ హెచ్చరిక..!!

- October 30, 2026 , by Maagulf
కెనడా వీసా అపాయింట్‌మెంట్లపై VFS గ్లోబల్ హెచ్చరిక..!!

కెనడా: కెనడా వీసా అపాయింట్‌మెంట్లను త్వరగా ఇప్పిస్తామని, వీసా తప్పకుండా మంజూరయ్యేలా చేస్తామని, ప్రత్యేక మార్గాల ద్వారా సేవలు అందిస్తామని హామీ ఇచ్చే ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని VFS గ్లోబల్ దరఖాస్తుదారులను హెచ్చరించింది. వీసా అపాయింట్‌మెంట్లు ఉచితమని, వాటిని తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. కెనడా ప్రభుత్వ తరఫున వీసా దరఖాస్తు కేంద్రాలను నిర్వహిస్తున్న VFS గ్లోబల్ ఈ హెచ్చరికను జారీ చేసింది. వీసా ప్రక్రియ పేరుతో మోసాలకు గురికాకుండా దరఖాస్తుదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వీసా దరఖాస్తుల ఆమోదం, ప్రాసెసింగ్ సమయం, వీసా చెల్లుబాటు వ్యవధిని నిర్ణయించే అధికారం తమకు లేదని VFS గ్లోబల్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలన్నీ కెనడా ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని తెలిపింది. VFS గ్లోబల్‌లోని IRCC అకౌంట్ మేనేజ్‌మెంట్ టీమ్ హెడ్ యాసీన్ ఎఫెండీ మాట్లాడుతూ.. ప్రతి వీసా దరఖాస్తుదారుడికి సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందాల్సిన అవసరం ఉందన్నారు. తమ సంస్థ పాత్ర పరిపాలనా సేవలకే పరిమితమని వివరించారు. దరఖాస్తుదారుల బయోమెట్రిక్ వివరాలను సేకరించడం, ప్రయాణ పత్రాలతో సహా అవసరమైన డాక్యుమెంట్లను సురక్షితంగా సంబంధిత అధికారులకు పంపించడం వంటి సేవలను అందిస్తామని తెలిపారు. 

వీసా మంజూరుపై తుది నిర్ణయం కెనడా ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.
VFS గ్లోబల్ థర్డ్ పార్టీ మధ్యవర్తులతో పనిచేయదని వెల్లడించింది. సోషల్ మీడియా, ఈ-మెయిల్, టెక్స్ట్ మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించే వ్యక్తులకు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందించవద్దని దరఖాస్తుదారులకు సూచించింది. ధృవీకరించిన అధికారిక మార్గాల ద్వారానే సమాచారాన్ని పంచుకోవాలని పేర్కొంది. ప్రీమియం లాంజ్ సదుపాయం, డాక్యుమెంట్లను కొరియర్ ద్వారా తిరిగి పంపించే సేవలు వంటి అదనపు సదుపాయాలు పొందినంత మాత్రాన వీసా మంజూరుపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అలాగే, ఈ సేవలు వీసా ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయవని తెలిపింది.

వీసా ప్రక్రియలో మోసం లేదా అక్రమాలకు సంబంధించిన అనుమానాలు ఎదురైతే VFS గ్లోబల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా గోప్యంగా ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న EthicsPoint రిపోర్టింగ్ లైన్ ద్వారా తెలియజేయవచ్చని సంస్థ సూచించింది. వీసా కేంద్రానికి వెళ్లే ముందు అధికారిక డాక్యుమెంట్ చెక్‌లిస్ట్‌ను పరిశీలించాలని, తమకు కేటాయించిన అపాయింట్‌మెంట్ సమయానికి చేరుకోవాలని దరఖాస్తుదారులకు సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com