కెనడా వీసా అపాయింట్మెంట్లపై VFS గ్లోబల్ హెచ్చరిక..!!
- October 30, 2026
కెనడా: కెనడా వీసా అపాయింట్మెంట్లను త్వరగా ఇప్పిస్తామని, వీసా తప్పకుండా మంజూరయ్యేలా చేస్తామని, ప్రత్యేక మార్గాల ద్వారా సేవలు అందిస్తామని హామీ ఇచ్చే ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని VFS గ్లోబల్ దరఖాస్తుదారులను హెచ్చరించింది. వీసా అపాయింట్మెంట్లు ఉచితమని, వాటిని తమ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. కెనడా ప్రభుత్వ తరఫున వీసా దరఖాస్తు కేంద్రాలను నిర్వహిస్తున్న VFS గ్లోబల్ ఈ హెచ్చరికను జారీ చేసింది. వీసా ప్రక్రియ పేరుతో మోసాలకు గురికాకుండా దరఖాస్తుదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వీసా దరఖాస్తుల ఆమోదం, ప్రాసెసింగ్ సమయం, వీసా చెల్లుబాటు వ్యవధిని నిర్ణయించే అధికారం తమకు లేదని VFS గ్లోబల్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలన్నీ కెనడా ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని తెలిపింది. VFS గ్లోబల్‌లోని IRCC అకౌంట్ మేనేజ్మెంట్ టీమ్ హెడ్ యాసీన్ ఎఫెండీ మాట్లాడుతూ.. ప్రతి వీసా దరఖాస్తుదారుడికి సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందాల్సిన అవసరం ఉందన్నారు. తమ సంస్థ పాత్ర పరిపాలనా సేవలకే పరిమితమని వివరించారు. దరఖాస్తుదారుల బయోమెట్రిక్ వివరాలను సేకరించడం, ప్రయాణ పత్రాలతో సహా అవసరమైన డాక్యుమెంట్లను సురక్షితంగా సంబంధిత అధికారులకు పంపించడం వంటి సేవలను అందిస్తామని తెలిపారు.
వీసా మంజూరుపై తుది నిర్ణయం కెనడా ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.
VFS గ్లోబల్ థర్డ్ పార్టీ మధ్యవర్తులతో పనిచేయదని వెల్లడించింది. సోషల్ మీడియా, ఈ-మెయిల్, టెక్స్ట్ మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించే వ్యక్తులకు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందించవద్దని దరఖాస్తుదారులకు సూచించింది. ధృవీకరించిన అధికారిక మార్గాల ద్వారానే సమాచారాన్ని పంచుకోవాలని పేర్కొంది. ప్రీమియం లాంజ్ సదుపాయం, డాక్యుమెంట్లను కొరియర్ ద్వారా తిరిగి పంపించే సేవలు వంటి అదనపు సదుపాయాలు పొందినంత మాత్రాన వీసా మంజూరుపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అలాగే, ఈ సేవలు వీసా ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయవని తెలిపింది.
వీసా ప్రక్రియలో మోసం లేదా అక్రమాలకు సంబంధించిన అనుమానాలు ఎదురైతే VFS గ్లోబల్ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా గోప్యంగా ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న EthicsPoint రిపోర్టింగ్ లైన్ ద్వారా తెలియజేయవచ్చని సంస్థ సూచించింది. వీసా కేంద్రానికి వెళ్లే ముందు అధికారిక డాక్యుమెంట్ చెక్లిస్ట్ను పరిశీలించాలని, తమకు కేటాయించిన అపాయింట్మెంట్ సమయానికి చేరుకోవాలని దరఖాస్తుదారులకు సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ బెలూన్ ఫెస్టివల్ వాయిదా..!!
- కెనడా వీసా అపాయింట్మెంట్లపై VFS గ్లోబల్ హెచ్చరిక..!!
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో కార్మికులకు లైసెన్స్డ్ వసతి తప్పనిసరి..!!
- జీసీసీ దేశాల ఐక్యతకు సైనికాధిపతుల పిలుపు..!!
- ఒమన్ లో మానవ అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక చర్యలు..!!
- నిద్రమత్తులో ట్రక్కు డ్రైవింగ్.. E611 రోడ్డు పై ప్రమాదం
- సూడాన్ సైన్యానికి ఆయుధాల సరఫరా కేసు.. 8 మందికి జీవిత ఖైదు
- ప్రజలకు పోలీసు సేవలను చేరవేయడమే ‘సురక్ష’ లక్ష్యం: డిజిపి సి.వి. ఆనంద్
- సంస్కృతి సమాజాలను కలిపే వారధి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా







