హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం

- November 02, 2026 , by Maagulf
హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్ నగరంలో భారీ ‘మహా పాదయాత్ర’ నిర్వహించారు. ‘ఇండియా’ (INDIA) కూటమి బీజేపీ ప్రభుత్వంపై చేపడుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే లక్ష్యంతో, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – అరాచకాన్ని తొలగించండి’ (లోక్‌తంత్ర బచావో – అరాచకత హటావో) అనే నినాదంతో బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ యాత్ర సాగింది.

జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభం

బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అమిత్ షా చేతిలో జాతీయ జెండా పట్టుకుని పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఆయనతో పాటు కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పాదయాత్ర మొజాంజాహీ (ఎంజే) మార్కెట్ వద్ద ముగియనుండగా, అక్కడ జరిగే కార్నర్ మీటింగ్‌లో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి చేసిన విమర్శలకు ఆయన ఈ వేదికపై నుంచే కౌంటర్ ఇవ్వనున్నారు.

కాంగ్రెస్‌పై ‘ఎక్స్’ వేదికగా తీవ్ర ధ్వజమెత్తు

పాదయాత్రకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “వరుస ఎన్నికల ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్, ప్రజాస్వామ్యాన్ని అరాచక మార్గాల ద్వారా హత్య చేసి అయినా సరే అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ కుట్రల నుంచి దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com