దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- November 04, 2026
రియాద్: దేశ సార్వభౌమత్వం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ లేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. దేశ జాతీయ భద్రతకు, పౌరులు, నివాసితుల ప్రాణ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలు లేదా దాడులనైనా తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించింది. రియాద్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు హెచ్చరించారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడం, స్థిరత్వాన్ని కాపాడటం, అభివృద్ధి, శ్రేయస్సు, శాశ్వత శాంతిని ప్రోత్సహించడం కోసం మిత్రదేశాలతో కలిసి దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగించాలని నిర్ణయించారు.
క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్.. సౌదీ రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్‌కు మలేషియా రాజు సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ పంపిన రెండు సందేశాల వివరాలను మంత్రివర్గానికి తెలియజేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తాను పంపిన సందేశం గురించి కూడా వివరించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, రొమేనియా అధ్యక్షుడు నికుసోర్ డాన్, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌లతో జరిపిన ఫోన్ సంభాషణలు, జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లాతో జరిగిన భేటీ వివరాలను వెల్లడించారు.
గల్ఫ్ సహకార మండలి (GCC), జీ20 ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో సౌదీ అరేబియా పాల్గొన్న అంశాలను కూడా మంత్రివర్గం సమీక్షించింది. వివిధ రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, పరస్పర ప్రయోజనాలను సాధించడం ఈ ప్రయత్నాల ముఖ్య ఉద్దేశమని మీడియా మంత్రి సల్మాన్ అల్ దోస్సరీ తెలిపారు. ముఖ్యంగా సముద్ర మార్గాల భద్రత, ఇంధనం, ఆహార భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలకు సంబంధించిన సవాళ్ల పరిష్కారంపై దృష్టి సారించినట్లు చెప్పారు.
సముద్ర రవాణా భద్రతకు, ప్రపంచ ఇంధన సరఫరాలకు ముప్పు కలిగించే చర్యలను సౌదీ అరేబియా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రివర్గం స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు ఆటంకాలు లేకుండా చూడటం, సముద్ర మార్గాల భద్రతను కాపాడటం, అంతర్జాతీయ చట్టాలను అమలు చేయడం కోసం ప్రపంచ దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. మౌలిక సదుపాయాలు, నిల్వ కేంద్రాలు, సరఫరా వ్యవస్థలపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంధన సరఫరాలను కొనసాగించగలుగుతున్నట్లు తెలిపింది.
ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అణు, రేడియేషన్ నియంత్రణ రంగాల్లో సమాచార మార్పిడి కోసం దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల సంబంధిత నియంత్రణ సంస్థలతో అవగాహన ఒప్పందాలపై చర్చలు జరిపి సంతకాలు చేసేందుకు అణు, రేడియేషన్ నియంత్రణ కమిషన్ ఛైర్మన్‌కు లేదా ఆయన ప్రతినిధికి అనుమతి ఇచ్చింది.
ఇక జాతీయ అంతరిక్ష విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో లేదా నిర్వహణలో ఉన్న ఎండోమెంట్ (వక్ఫ్) ఖాతాలకు సంబంధించిన ఆర్థిక పర్యవేక్షణ నిబంధనలను ఆమోదించింది. జనరల్ అథారిటీ ఫర్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్‌కు చెందిన కొన్ని బాధ్యతలు, విధులను నేషనల్ ఈవెంట్స్ సెంటర్, సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అథారిటీలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!
- బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!
- కువైట్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంలో నర్సుల పాత్ర కీలకం..!!
- దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!







