బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!

- November 04, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!

మనామా: బహ్రెయిన్‌లో పర్యాటక, ఆతిథ్య, రిటైల్ రంగాలకు భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ భారతీయ హోటళ్ల సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL), బహ్రెయిన్‌కు చెందిన కింగ్‌డమ్ ప్రాజెక్ట్స్ కలిసి $100 మిలియన్ల పెట్టుబడితో మూడు కీలక ప్రాజెక్టులను చేపట్టనున్నాయి. నవంబర్ 1-2 తేదీల్లో మనామాలో జరిగిన నాలుగో గేట్‌వే గల్ఫ్ సదస్సులో ఈ ఒప్పందాలను ప్రకటించారు.

ఈ ప్రాజెక్టుల్లో భాగంగా తొలిసారిగా బహ్రెయిన్‌లో తాజ్ హోటల్ బ్రాండ్ అడుగుపెట్టనుంది. సీఫ్ డౌన్‌టౌన్ ప్రాంతంలో 200 గదులతో పాటు 80 బ్రాండెడ్ రెసిడెన్సీలతో తాజ్ హోటల్ డౌన్ టౌన్ సీఫ్ (Taj Hotel Downtown Seef) నిర్మించనున్నారు. ఈ హోటల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

బహ్రెయిన్ బే ప్రాంతంలో తాజ్ హోటల్స్ కు చెందిన ప్రముఖ భారతీయ రెస్టారెంట్ బ్రాండ్ 'బాంబే బ్రాసరీ'ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటీరియర్ పనులు జరుగుతుండగా, 2027 మొదటి త్రైమాసికంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరోవైపు, ప్రముఖ బొమ్మల విక్రయ సంస్థ 'Hamleys' తన ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌ను ది అవెన్యూస్ బహ్రెయిన్‌లో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ పిల్లలు, కుటుంబ సభ్యులకు ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్ షాపింగ్ అనుభవాన్ని అందించనున్నారు. ఈ స్టోర్ కూడా 2027 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది.

ఈ ఒప్పందం ప్రకారం బహ్రెయిన్‌లో తాజ్ గ్రూప్‌కు కింగ్‌డమ్ ప్రాజెక్ట్స్ ప్రత్యేక భాగస్వామిగా వ్యవహరించనుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టేందుకు ఇరు సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 

ఈ కార్యక్రమంలో బహ్రెయిన్ సుస్థిర అభివృద్ధి శాఖ మంత్రి, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (EDB) చీఫ్ ఎగ్జిక్యూటివ్ నూర్ బింట్ అలీ అల్ ఖులైఫ్, పర్యాటక శాఖ మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ పాల్గొన్నారు. ఈ పెట్టుబడులు బహ్రెయిన్‌పై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని నూర్ అల్ ఖులైఫ్ పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల రాకతో దేశంలో పర్యాటక, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com