బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!

- November 04, 2026 , by Maagulf
బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!

అబుదాబి: యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ నవంబర్ లైవ్ డ్రాలో భారతీయ ప్రవాసి మీనా సరీన్ Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్నారు. నవంబర్ 3న నిర్వహించిన సిరీస్ 292 లైవ్ డ్రాలో ఆమె విజేతగా నిలిచారు. దుబాయ్‌లో నివసిస్తున్న ఆమె అక్టోబర్ 18న విజేత టికెట్‌ను కొనుగోలు చేశారు. 304251 నంబర్ గల విజేత టికెట్‌ను గత నెలలో Dh20 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన బెర్నాడెట్ అజుసెనా ఎంపిక చేశారు. అంతకుముందు సెప్టెంబర్ 3న పాకిస్థాన్‌కు చెందిన షౌకత్ అఫ్తాబ్ Dh15 మిలియన్ల బహుమతిని సొంతం చేసుకున్నారు.

 ఇంకా ఈ డ్రాలో మరో భారతీయ ప్రవాసి కాజా తుల్యాత్ లగ్జరీ రేంజ్ రోవర్ వెలార్ కారును గెలుచుకున్నారు. అక్టోబర్ 27న కొనుగోలు చేసిన 025383 నంబర్ టికెట్‌కు ఈ బహుమతి దక్కింది. అల్ ఐన్‌లో నివసిస్తున్న ఆయనకు ఈ లగ్జరీ కారు లభించింది. డిసెంబర్ 3న జరిగే తదుపరి డ్రాలో నిస్సాన్ పెట్రోల్ కారును బహుమతిగా అందించనున్నారు.

ఐదుగురికి 200 గ్రాముల బంగారు బిస్కెట్లు

ఈ డ్రాలో మరో ఐదుగురు విజేతలకు ఒక్కొక్కరికి 200 గ్రాముల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్ లభించింది. వీరిలో షార్జాలో నివసించే బంగ్లాదేశ్ ప్రవాసి మహమ్మద్ సైఫుల్ ఇస్లాం (302129), అబుదాబిలో నివసించే భారతీయుడు మహమ్మద్ ముస్లిం (197099), అల్ ఐన్‌లో నివసించే అన్షాద్ VM (048930), అల్ దైధ్‌కు చెందిన యూఏఈ జాతీయుడు అహ్మద్ అల్ కేత్బీ (236854), అల్ ఐన్‌లో నివసించే కేరళకు చెందిన షఫీ బాబోహాజీ (346934) ఉన్నారు.

బిగ్ స్పిన్‌లో ముగ్గురికి నగదు బహుమతులు

బిగ్ స్పిన్ గేమ్‌లో ముగ్గురు పాల్గొని నగదు బహుమతులు గెలుచుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఇనామ్ ఉల్ హుస్సేన్ తరఫున నిర్వాహకుడు రిచర్డ్ వీల్ తిప్పగా ఆయనకు Dh50,000 లభించాయి.

దుబాయ్‌లో నివసించే భారతీయ ప్రవాసి ప్రీతమ్ కుమార్ స్వయంగా పాల్గొని Dh100,000 గెలుచుకున్నారు. తనతో కలిసి టికెట్ కొనుగోలు చేసిన స్నేహితులతో ఈ మొత్తాన్ని పంచుకోనున్నారు. యూఏఈలో నివసించే ఈజిప్టు ప్రవాసి గాసర్ అల్ అగామీ కూడా Dh100,000 గెలుచుకున్నారు.

డిసెంబర్ 3న జరిగే తదుపరి లైవ్ షోలో బిగ్ స్పిన్ కోసం అబుదాబికి చెందిన భారతీయ ప్రవాసి అబ్దుల్ సలాం (286526), బ్రిటన్‌కు చెందిన కేరన్ ఓఫ్లాహెర్టీ (003722), బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ ఆలం (106885) ఎంపికయ్యారు.

కష్టాల్లో ఉన్న కుటుంబానికి Dh100,000 సాయం

బిగ్ టికెట్ నిర్వహిస్తున్న 'డియర్ బిగ్ టికెట్' కార్యక్రమంలో భాగంగా పలువురికి Dh100,000 చొప్పున బహుమతులు అందించారు. తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ వేలాది మంది పంపిన కథల్లో ఇనేష్ మోహన్, ఆయన భార్య మోనిక్‌ల కథ ప్రత్యేకంగా నిలిచింది. వారి కుమారుడు జాక్ పుట్టుకతోనే తీవ్రమైన మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. మెదడు కాండం (Brain Stem) లేకుండా జన్మించిన అతను వినలేడు, చూడలేడు. గత ఏడున్నరేళ్లుగా లైఫ్ సపోర్ట్‌పై ఉన్నాడు. కుమారుడి కోసం సొంత ఇల్లు సమకూర్చుకోవాలన్నది తల్లిదండ్రుల కల. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా డెవలపర్‌కు చెల్లింపులు చేయలేక న్యాయపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాక్ తల్లి మోనిక్‌కు బిగ్ టికెట్ ద్వారా బహుమతి లభించడంతో వారి కుటుంబానికి పెద్ద ఊరట లభించింది. "ఈ విజయం పూర్తిగా ఊహించనిది. ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. గత ఏడున్నరేళ్లుగా లైఫ్ సపోర్ట్‌పై ఉన్న మా కుమారుడి కోసం ఇంటిని కాపాడుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది" అని కన్నీళ్లతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

డ్రా ప్రారంభంలోనే కార్యక్రమ నిర్వాహకులు రిచర్డ్, బౌచ్రా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. బిగ్ టికెట్ ప్రతినిధులమంటూ కొందరు వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారని హెచ్చరించారు. విజేతల వివరాలను అధికారిక వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రమే ధ్రువీకరించుకోవాలని, అపరిచితులకు వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. తదుపరి బిగ్ టికెట్ లైవ్ డ్రా డిసెంబర్ 3న నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com