ఒమన్‌లో ఉద్యోగ, శిక్షణ లక్ష్యాల్లో 89 శాతం పూర్తి..!!
- November 04, 2026
మస్కట్: ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ 2026 సంవత్సరానికి నిర్దేశించుకున్న ఉద్యోగ కల్పన, ఉద్యోగ శిక్షణ లక్ష్యాల్లో సెప్టెంబర్ చివరి నాటికి 89 శాతం పూర్తి చేసింది. మొత్తం 60,000 అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 53,525 అవకాశాలను అందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జాతీయ ఉపాధి ప్రణాళిక అమలులో భాగంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వివిధ ఆర్థిక రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉద్యోగాలు, ప్రత్యామ్నాయ నియామకాలు కలిపి ఇప్పటివరకు 41,024 అవకాశాలు కల్పించారు. ఇది నిర్దేశిత లక్ష్యంలో 95 శాతం. ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత ఇచ్చే శిక్షణకు సంబంధించి 12,501 అవకాశాలు అందించారు. ఈ విభాగంలో 74 శాతం లక్ష్యాన్ని సాధించారు.
ఉద్యోగ కల్పన, స్థానికీకరణలో ప్రభుత్వ రంగం తన లక్ష్యాన్ని మించి పనిచేసింది. ప్రభుత్వ రంగంలో 10,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 14,235 అవకాశాలను పూర్తి చేసింది. ప్రైవేట్ రంగంలో 33,000 తొలి ఉద్యోగాల లక్ష్యానికి గాను 26,789 అవకాశాలు కల్పించింది. ఇక ఉద్యోగ శిక్షణ విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో 2,000 అవకాశాల లక్ష్యానికి గాను 2,370 మందికి శిక్షణ కల్పించారు. ప్రైవేట్ రంగంలో 15,000 లక్ష్యానికి గాను 10,131 అవకాశాలు అందించారు.
ఉద్యోగార్థుల నైపుణ్యాలను పెంపొందించి, వారి విద్యార్హతలు, సామర్థ్యాలకు తగిన ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ శిక్షణ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. సంస్థల వాస్తవ అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం ద్వారా ఉద్యోగ స్థిరత్వాన్ని పెంచడంతోపాటు జాతీయ శ్రామిక శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఉద్యోగ నియామకాలు, ప్రత్యామ్నాయ నియామకాలు, ఉద్యోగ శిక్షణ అవకాశాలు కలిపి మొత్తం 95,323కు చేరాయి. వీరిలో గతంలో పని అనుభవం ఉన్నవారు 41,798 మంది ఉన్నారు. అనుభవం ఉన్న ఉద్యోగార్థుల నైపుణ్యాలను కూడా వినియోగించుకుంటూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల అవసరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నట్లు వివరించింది.
2026 ఉపాధి ప్రణాళిక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉద్యోగ, శిక్షణ కార్యక్రమాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, స్థానికులకు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించడం, వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి విధానాలను మరింత మెరుగుపరచనున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!
- అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు!
- కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!
- ఒమన్‌లో ఉద్యోగ, శిక్షణ లక్ష్యాల్లో 89 శాతం పూర్తి..!!
- గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ
- బహ్రెయిన్‌లో విద్యుత్, నీటి వినియోగదారులకు గుడ్ న్యూస్..!!
- యూఏఈలో వింటర్ హాలిడేస్.. చివరి నిమిషంలో ట్రిప్‌లకు పెరుగుతున్న డిమాండ్..!!
- వాట్సాప్ సిమ్ బైండింగ్ నిబంధనలు..
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!







