యూట్యూబ్ చూసి ఫేక్ కరెన్సీ తయారీ..
- November 04, 2026
హైదరాబాద్: యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ కరెన్సీ తయారీని నేర్చుకున్న ఓ వ్యక్తి.. హైదరాబాద్ శివార్లలో భారీ నకిలీ నోట్ల రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుంట్లూరులో ఏర్పాటు చేసిన రహస్య తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి ఏకంగా రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా మొదట రూ.8 లక్షల నకిలీ నోట్లు పట్టుబడటంతో ఈ భారీ ముఠా గుట్టురట్టయింది. నకిలీ పోలీసుల వేషంలో బాధితులను బెదిరించి అసలు డబ్బు దోచుకున్నట్లు కూడా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పట్టుబడ్డ దొంగనోట్లు
ఈనెల 1వ తేదీన హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పోలీసులు రొటీన్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక కారును అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో రూ.8 లక్షల విలువైన నకిలీ కరెన్సీ బయటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారులో ఉన్న ఎం. కరుణాకర్, సీహెచ్. మాణిక్యరెడ్డి, సీహెచ్. రత్నాకర్‌రెడ్డి, కె. అజయ్కుమార్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ఇచ్చిన సమాచారంతో కుంట్లూరులో నిర్వహిస్తున్న నకిలీ నోట్ల తయారీ కేంద్రం గుట్టు రప్పించారు. ఆ అద్దె ఇంటిపై దాడి చేసిన పోలీసులు రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లతో పాటు ప్రింటర్లు, ల్యాప్‌టాప్, కరెన్సీ కటింగ్ యంత్రాలు మరియు ఇతర తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
యూట్యూబ్‌లో నేర్చుకుని.. ఇంట్లోనే ప్రింటింగ్!
సినిమాల్లో చూసే నకిలీ కరెన్సీ దందాను ఈ ముఠా నిజ జీవితంలో అమలు చేసింది. ఈ రాకెట్‌కు ప్రధాన నిందితుడిగా ఉన్న కరుణాకర్.. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వీడియోలను చూసి నకిలీ నోట్లు ముద్రించడం నేర్చుకున్నాడు. అసలు రూ.500 నోటును స్కాన్ చేసి, ఫొటోషాప్‌లో ఎడిట్ చేయడం ద్వారా అచ్చం అసలు నోటును పోలిన నకిలీ నోట్లను తయారు చేసే విధానాన్ని ఒంటపట్టించుకున్నాడు. ఆ తర్వాత కుంట్లూరులో ఒక అద్దె ఇంటిని తీసుకుని దాన్ని ఏకంగా నకిలీ కరెన్సీ తయారీ కేంద్రంగా మార్చేశాడు.
నకిలీ నోట్లతో మోసాలు.. నకిలీ పోలీసుల వేషాలు!
ఈ ముఠా కేవలం నకిలీ నోట్ల ముద్రణ, చలామణీకే పరిమితం కాలేదు. తక్కువ ధరకు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ.. అసలు డబ్బుకు మూడు, నాలుగు రెట్ల విలువైన నకిలీ నోట్లు అందిస్తామని ఆశ చూపి అమాయకులను ఆకర్షించేవారు. అలా డబ్బుతో వచ్చేవారు మోసపోయామని గ్రహించేలోపే, ఈ ముఠా సభ్యులు నకిలీ పోలీసుల వేషధారణలో వచ్చి వారిని బెదిరించి అసలు డబ్బును సైతం దోచుకునేవారమని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
తాజా వార్తలు
- యూట్యూబ్ చూసి ఫేక్ కరెన్సీ తయారీ..
- ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో భారత్ నౌకలకు మినహాయింపు
- ప్రపంచ రికార్డు సాధించిన విరాట్ కోహ్లి
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!
- అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు!
- కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!
- ఒమన్‌లో ఉద్యోగ, శిక్షణ లక్ష్యాల్లో 89 శాతం పూర్తి..!!
- గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ
- బహ్రెయిన్‌లో విద్యుత్, నీటి వినియోగదారులకు గుడ్ న్యూస్..!!







