భారత్‌లోని విదేశీ పౌరులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనల సడలింపు

- November 05, 2026 , by Maagulf
భారత్‌లోని విదేశీ పౌరులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనల సడలింపు

న్యూ ఢిల్లీ: విదేశీయులు, వివిధ దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు ఉపశమనం కలిగిస్తూ భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సవరించింది. హోం మంత్రిత్వ శాఖ గురువారం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం.. ‘ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ (ఎగ్జెంప్షన్) (అమెండ్మెంట్) ఆర్డర్, 2026’ తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం శరణార్థుల బసకు నిబంధనలు సడలించడంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్‌ల ప్రయాణ నిబంధనలను మరింత సులభతరం చేశారు.

ఈ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చిన ప్రధాన నిబంధనలు ఇవే
పాకిస్తానీ పౌరులకు మినహాయింపు

2009 డిసెంబర్ 31 లేదా అంతకుముందు శాశ్వత నివాస ఉద్దేశంతో భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ పౌరులు తమ దేశ కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ లేకపోవడం వల్ల పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేసుకోలేకపోతే, ఆ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది.

షరతులు: వీరు పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు వివాహం చేసుకుని ఉండకూడదు, అక్కడ ఎలాంటి స్థిరాస్తులు ఉండకూడదు, కుటుంబ సభ్యులు భారత్‌లోనే ఉండాలి మరియు తిరిగి పాకిస్తాన్ వెళ్లబోమని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి ఎలాంటి ప్రతికూల నివేదికలు ఉండకూడదు.

భారత సంతతి మలేషియా, సింగపూర్ పౌరులు

మలేషియా లేదా సింగపూర్ పౌరసత్వం పొంది, 2009 డిసెంబర్ 31 నాటికి ఆయా దేశాల పాస్‌పోర్టులతో భారత్‌కు వచ్చి, పాస్‌పోర్ట్ గడువు తీరిన భారత సంతతి వ్యక్తులకు కూడా నిబంధనల నుంచి సడలింపు లభించింది. వీరు భారత్‌లో బస కొనసాగించడానికి తగిన వీసా వర్గాన్ని పొందాల్సి ఉంటుంది.

నేపాల్, భూటాన్ ప్రయాణ మార్గదర్శకాలు

భారత్, నేపాల్, భూటాన్ పౌరులు ఈ దేశాల మధ్య ప్రత్యక్షంగా (నేల లేదా విమాన మార్గం ద్వారా) ప్రయాణించేటప్పుడు ప్రమాణిక పాస్‌పోర్టులకు బదులుగా హోం శాఖ “వీసా మాన్యువల్” లో పేర్కొన్న గుర్తింపు కార్డులను సమర్పించవచ్చు. అయితే, నేపాల్ లేదా భూటాన్ సరిహద్దుల ద్వారా మూడో దేశాలకు ప్రయాణించే భారత పౌరులు ఖచ్చితంగా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. అలాగే చైనా, మకావు, హాంకాంగ్, లేదా పాకిస్తాన్ మార్గాల ద్వారా వచ్చే/వెళ్లే నేపాల్, భూటాన్ పౌరులకు పాస్‌పోర్ట్, వీసా రెండూ తప్పనిసరి.

మైనారిటీ శరణార్థులకు రక్షణ

అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపుల కారణంగా 2024 డిసెంబర్ 31 లేదా అంతకుముందు భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రిస్టియన్ వర్గాల వారికి పాస్‌పోర్ట్, ప్రయాణ పత్రాల నిబంధనల నుంచి మినహాయింపు వర్తిస్తుంది. సరైన ప్రయాణ పత్రాలు లేకున్నా, గడువు ముగిసినా వీరు తగిన వీసా పొంది భారత్‌లో కొనసాగవచ్చు.

శ్రీలంక తమిళులు, టిబెటన్లు

2015 జనవరి 9 నాటికి భారత్‌లో ఆశ్రయం పొంది నమోదైన శ్రీలంక తమిళులకు సాధారణ పాస్‌పోర్ట్, వీసా నిబంధనల నుంచి సడలింపు నిచ్చారు.

1959 నుండి 2003 మే 30 మధ్య ఖాట్మండు రాయబార కార్యాలయ అనుమతులతో లేదా ప్రత్యేక ఎంట్రీ పర్మిట్లతో వచ్చిన టిబెటన్ శరణార్థులు అధికారుల వద్ద నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com