సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!

- November 09, 2026 , by Maagulf
సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!

వాషింగ్టన్: సౌదీ అరేబియా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల వ్యాపార మండలి కొత్త కార్యాచరణకు సిద్ధమైంది. పరస్పర ప్రయోజనాలు కలిగిన రంగాల్లో వాణిజ్యాన్ని విస్తరించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యాపార భాగస్వామ్యాలను పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించింది.

అమెరికా–సౌదీ బిజినెస్ కౌన్సిల్ డైరెక్టర్ల బోర్డు సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. ఈ సమావేశానికి సౌదీ ఇంధన, పరిశ్రమలు, ఖనిజ వనరుల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, పెట్టుబడుల మంత్రి ఫహద్ అల్ సైఫ్‌తో పాటు ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. కౌన్సిల్ సహ అధ్యక్షులు లుబ్నా ఒలయాన్, జేన్ ఫ్రేజర్ సంయుక్తంగా సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధికి సౌదీ అరేబియా కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కీలక మౌలిక సదుపాయాల రంగాల్లో కొత్త పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సౌదీ, అమెరికా వ్యాపార రంగాల మధ్య భాగస్వామ్యం బలంగా ఉందని వివరించారు.

పెట్టుబడుల మంత్రి ఫహద్ అల్ సైఫ్ త్వరలో అమలు చేయనున్న రెండో విడత జాతీయ పెట్టుబడి వ్యూహంలోని ముఖ్యాంశాలను వివరించారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికే పరిమితం కాకుండా, గుర్తించిన పెట్టుబడి అవకాశాలను వాస్తవ పెట్టుబడులుగా మార్చడమే ఈ వ్యూహం ప్రధాన లక్ష్యమని చెప్పారు. దీనివల్ల ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.

సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల ప్రాధాన్యం, వాటిని మరింత అభివృద్ధి చేయడంలో బిజినెస్ కౌన్సిల్ పోషించాల్సిన పాత్రపై చర్చించారు.

ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నిరంతర సంప్రదింపులు, సన్నిహిత సహకారం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ఆర్థిక సంబంధాలు బలమైన పునాదులపై కొనసాగుతున్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేయడంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com