2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. మార్పులివే..!!
- November 10, 2026
దుబాయ్: యూఏఈలో 2027 జనవరి 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, ఈ-స్కూటర్ వినియోగం, డ్రైవింగ్ సమయం, లెర్నర్ పర్మిట్లు, పిల్లల భద్రత, డెలివరీ రైడర్లకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. 2026 నాటి క్యాబినెట్ నిర్ణయం నంబర్ 174 ప్రకారం ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. వాహనదారులు, ప్రవాసులు, డెలివరీ రంగంలో పనిచేసేవారు ముందుగానే ఈ మార్పులు మీ కోసం..
ఈ-స్కూటర్ వినియోగదారులకు కొత్త నిబంధనలు
కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, చిన్న మోటరైజ్డ్ బైక్‌లకు మూడేళ్ల కాలపరిమితితో పర్మిట్లు జారీ చేస్తారు. దరఖాస్తుదారుల కనీస వయస్సు 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ-స్కూటర్ నడపడానికి సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి. వాహనాల రిజిస్ట్రేషన్ కూడా సంబంధిత అధికారుల నిబంధనల ప్రకారం చేయించుకోవాలి. అలాగే,అధికారులు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాలి. వాహనాల రాకపోకల కోసం ప్రత్యేకంగా కేటాయించిన రోడ్లపై ఈ-స్కూటర్లు నడపకూడదు. ప్రైవేటు వినియోగంతో పాటు అద్దెకు ఇచ్చే ఈ-స్కూటర్లకూ భద్రతా నిబంధనలు వర్తిస్తాయి.
24 గంటల్లో గరిష్ఠంగా 9 గంటల డ్రైవింగ్
డ్రైవర్లు 24 గంటల వ్యవధిలో గరిష్ఠంగా 9 గంటలు మాత్రమే వాహనం నడపాలని కొత్త నిబంధనలో పేర్కొన్నారు. ఈ పరిమితిని ప్రత్యేకంగా ట్రక్ డ్రైవర్లకు మాత్రమే కాకుండా డ్రైవింగ్‌కు సంబంధించి సాధారణంగా పేర్కొన్నారు. అయితే డ్రైవర్ అలసట లేదా నీరసంతో సురక్షితంగా వాహనం నడపలేని పరిస్థితిలో ఉంటే 9 గంటల పరిమితి పూర్తికాకముందే డ్రైవింగ్ చేయకూడదు. ఈ గరిష్ఠ సమయాన్ని ఎలా లెక్కిస్తారు.
10 ఏళ్లకు పైగా గడువు ముగిసిన లైసెన్సులకు పరీక్షలు
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసి 10 ఏళ్లకు పైగా రెన్యూవల్ చేయించుకోని వారు తిరిగి లైసెన్స్ పొందాలంటే థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. లైసెన్స్ గడువు ముగిసిన తేదీ నుంచి ఈ 10 ఏళ్ల కాలాన్ని లెక్కిస్తారు. పరీక్షల విధానాన్ని సంబంధిత లైసెన్సింగ్ అధికారులు నిర్ణయిస్తారు.
లెర్నర్ పర్మిట్ గడువు 6 నెలలకు పెంపు
డ్రైవింగ్ నేర్చుకునేవారికి ఇచ్చే లెర్నర్ పర్మిట్ గరిష్ఠ గడువును మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచారు. అవసరమైతే పర్మిట్‌ను రెన్యూవల్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఆరు నెలల పర్మిట్ తప్పనిసరిగా ఇస్తారని కాదు. డ్రైవింగ్ శిక్షణ సమయంలో వాహనంలో లెర్నర్, శిక్షకుడు మాత్రమే ఉండాలి. జనావాస ప్రాంతాల్లో రోడ్లపై డ్రైవింగ్ చేసేందుకు శిక్షకుడు లెర్నర్కు వాహనంపై నియంత్రణ ఉందని నిర్ధారించుకోవాలి.
పిల్లల భద్రతకు ప్రత్యేక నిబంధనలు
నాలుగేళ్లు, అంతకంటే తక్కువ వయస్సున్న పిల్లలను వాహనాల్లో ప్రయాణించేటప్పుడు వారి ఎత్తు, బరువుకు తగిన చైల్డ్ సేఫ్టీ సీట్లలో కూర్చోబెట్టాలి. ఇవి యూఏఈ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాహనంలో వెనుక సీట్లు లేని సందర్భాల్లో ముందు భాగంలో వెనుకవైపు తిరిగి ఉండే చైల్డ్ సీటును ఏర్పాటు చేయాలి. ఈ సమయంలో ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరిగా నిలిపివేయాలి. వైద్యపరమైన కారణాలతో చైల్డ్ సీటు ఉపయోగించలేని పరిస్థితుల్లో సంబంధిత వైద్య అధికారుల ధ్రువీకరణ అవసరం. అలాగే పిల్లలతో పాటు వెనుక సీటులో ఒకరు ఉండాలి. 10 ఏళ్లు దాటిన లేదా 145 సెంటీమీటర్ల ఎత్తు చేరుకున్న పిల్లలు ముందు సీటులో కూర్చోవచ్చనే నిబంధన కొనసాగుతుంది.
డెలివరీ రైడర్లకు కొత్త ఆంక్షలు
మోటార్‌సైకిళ్లపై డెలివరీ చేసే రైడర్లు వీపుపై బ్యాగులు వేసుకుని ఆర్డర్లు తీసుకెళ్లకూడదు. అనుమతి పొందిన సరుకు రవాణా పద్ధతులనే ఉపయోగించాలి. డెలివరీ కోసం లైసెన్స్ పొందిన మోటార్‌సైకిళ్లపై ఆర్డర్లు తీసుకెళ్లే సమయంలో వెనుక మరొక వ్యక్తిని కూర్చోబెట్టకూడదు. ప్రొఫెషనల్ డ్రైవర్లు, డెలివరీ వాహనాల డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే ప్రొఫెషనల్ పర్మిట్ కలిగి ఉండాలి. అధికారులు అడిగినప్పుడు దాన్ని చూపించాలి. గడువు ముగిసిన పర్మిట్‌తో పనిచేయడానికి అనుమతి ఉండదు. ఈ పర్మిట్ల గడువు రెండేళ్లుగా నిర్ణయించారు.
ఓవర్‌టేకింగ్, పాదచారుల క్రాసింగ్‌పై నిబంధనలు
రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాల కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు ఓవర్‌టేకింగ్ చేయకూడదు. అలాగే మలుపులు, సర్కిల్స్, రౌండబౌట్లు, పాదచారుల క్రాసింగ్‌ల సమీపంలో, రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఓవర్టేకింగ్పై నిషేధం ఉంటుంది. పాదచారుల క్రాసింగ్‌ల వద్దకు చేరుకునే వాహనదారులు వేగాన్ని తగ్గించి, అవసరమైతే ఆగేందుకు సిద్ధంగా ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని క్రాసింగ్‌ల వద్ద పాదచారులు రోడ్డు దాటడం ప్రారంభిస్తే వాహనాలను పూర్తిగా నిలిపివేసి వారు దాటే వరకు వేచి ఉండాలి.
వేగ పరిమితులు, జరిమానాలు
జనావాస ప్రాంతాల్లో అంతర్గత రహదారులపై గరిష్ఠ వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లుగా కొనసాగుతుంది. అయితే ఇది స్పష్టమైన వేగ సూచిక బోర్డులు ఉన్న ప్రాంతాలకు వర్తిస్తుంది. స్పీడ్ లిమిట్స్ ఉల్లంఘించినప్పుడు జరిమానాల అమలుకు సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి. అయితే వేగ పరిమితికి అదనంగా ఎంత వేగాన్ని అనుమతిస్తారనే విషయంలో కొత్త నిబంధన ప్రత్యేకంగా ఎలాంటి సంఖ్యను పేర్కొనలేదు. కాగా అత్యవసర సేవల కోసం వెళ్తున్న వాహనాలకు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న వాహనాలకు కొన్ని మినహాయింపులు కొనసాగుతాయి.
జనవరి 1, 2027 నుంచి అమలు
ఈ కొత్త నిబంధనలతో 1997 నాటి మంత్రిత్వశాఖ నిర్ణయం నంబర్ 130, దాని అమలు ఉత్తర్వులను భర్తీ చేయనున్నారు. 2026 నాటి క్యాబినెట్ నిర్ణయం నంబర్ 174లోని ఆర్టికల్ 131 ప్రకారం 2027 జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. యూఏఈలో నివసిస్తున్న వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రవాసులు, ఈ-స్కూటర్ వినియోగదారులు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సేవలు మరింత సులభతరం..!!
- బహ్రెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కౌన్సిల్ కీలక నిర్ణయం..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. మార్పులివే..!!
- కన్ఫామ్ టికెట్ లేకుంటే వందే భారత్ ఎక్కలేరు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!
- ట్రంప్ సంచలన నిర్ణయం..
- విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన పవన్–అన్నా లెజినోవా
- యూఏఈలో వాహనాల సంఖ్యపై పరిమితి అమలు వాయిదా..!!







