ఖతార్‌లో ప్రైవేట్ స్కూల్స్, కిండర్‌గార్టెన్లకు కొత్త మార్గదర్శకాలు..!!

- November 10, 2026 , by Maagulf
ఖతార్‌లో ప్రైవేట్ స్కూల్స్, కిండర్‌గార్టెన్లకు కొత్త మార్గదర్శకాలు..!!

దోహా: ఖతార్‌లోని ప్రైవేట్ పాఠశాలలు, కిండర్‌గార్టెన్ల నిర్వహణను మరింత క్రమబద్ధీకరించేందుకు విద్య, ఉన్నత విద్యాశాఖ కొత్త నియంత్రణ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడం, వాటిపై చర్యలు తీసుకోవడం, విద్యార్థులకు సురక్షితమైన, స్థిరమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నది. మంత్రిత్వశాఖ ప్రధాన కార్యాలయంలోని థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మార్గదర్శకాలను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులతో పాటు ప్రైవేట్ పాఠశాలలు, కిండర్‌గార్టెన్ల ప్రతినిధులు హాజరయ్యారు.

విద్యా సేవల నాణ్యతను పెంచడం, నియంత్రణ నిబంధనల అమలును బలోపేతం చేయడం, విద్యాసంస్థల్లో విద్యార్థులు, సిబ్బంది హక్కులకు రక్షణ కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యమని శాఖ వెల్లడించింది. ఖతార్ జాతీయ విజన్ 2030లోని మానవ, సామాజిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల లైసెన్స్‌దారులు, యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉద్యోగుల బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించారు. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడం, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలు, సరిదిద్దే విధానాలను ఇందులో పొందుపరిచారు. అలాగే చర్యలు తీసుకునే విషయంలో పారదర్శకత, న్యాయబద్ధత, సమానత్వం పాటించేలా వ్యవస్థను రూపొందించారు.

2022 నాటి అమీరీ నిర్ణయం నంబర్ 35, ప్రైవేట్ పాఠశాలల నియంత్రణకు సంబంధించిన 2015 నాటి చట్టం నంబర్ 23లోని ఆర్టికల్ 37, సంబంధిత అమలు నిబంధనలు, ఇతర ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. అయితే ఇవి ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలకు ప్రత్యామ్నాయం కావని, సంబంధిత అధికారుల చట్టపరమైన అధికారాలను పరిమితం చేయవని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దులజీజ్ అల్ నమా మాట్లాడుతూ.. ఈ మార్గదర్శకాల అసలైన ప్రయోజనం వాటిని పాఠశాలలు ఎంత సమర్థంగా అమలు చేస్తాయనే దానిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాలల యాజమాన్యాలు వీటిని రోజువారీ నిర్వహణలో ప్రామాణిక మార్గదర్శకాలుగా ఉపయోగించుకోవాలని సూచించారు. అంతర్గత విధానాలను సమీక్షించి, రికార్డులను నిర్వహించడంతో పాటు స్వీయ పర్యవేక్షణ, లోపాల సవరణ చర్యలను బలోపేతం చేయాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com