2027 నుంచి సౌదీ అరేబియాలో అల్ట్రా లగ్జరీ ఎడారి రైలు..బుకింగ్స్ ప్రారంభం

- November 10, 2026 , by Maagulf
2027 నుంచి సౌదీ అరేబియాలో అల్ట్రా లగ్జరీ ఎడారి రైలు..బుకింగ్స్ ప్రారంభం

రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోని అద్భుతమైన ఎడారి ప్రాంతాలు, ప్రకృతి అందాలు, చారిత్రక వారసత్వాన్ని పర్యాటకులకు పరిచయం చేసే లక్ష్యంతో రూపొందించిన అత్యంత విలాసవంతమైన రైలు ప్రాజెక్టు ‘డ్రీమ్ ఆఫ్ ది డెజర్ట్’ ప్రయాణాలకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 2027 అక్టోబర్ నుంచి ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మధ్యప్రాచ్యంలోనే తొలి అల్ట్రా లగ్జరీ ఎడారి రైలు ప్రాజెక్టుగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. సౌదీ అరేబియా రైల్వేస్ (SAR), ఇటలీకి చెందిన ఆర్సెనాలే గ్రూప్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి.

రియాద్ నుంచి బయలుదేరే ఈ రైలు సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలైన అల్ జౌఫ్, హైల్, ఖాసిమ్ మీదుగా ప్రయాణించనుంది. మూడు నుంచి నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఎడారి ప్రకృతి అందాలు, స్థానిక సంస్కృతి, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు.

రైలులో విలాసవంతమైన సదుపాయాలు

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 24 లగ్జరీ సూట్లు, ప్రత్యేక రెస్టారెంట్ కోచ్, సౌదీ సంప్రదాయ ‘మజ్లిస్’ శైలిలో రూపొందించిన లాంజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక విలాసవంతమైన సౌకర్యాలతో పాటు సౌదీ అరేబియా సంప్రదాయ డిజైన్లు, ఆతిథ్య సంస్కృతిని ప్రతిబింబించేలా రైలు ఇంటీరియర్స్‌ను రూపొందిస్తున్నారు.

ఇద్దరికి $23 వేల డాలర్ల ప్రారంభ ధర

ఈ లగ్జరీ రైలు ప్రయాణానికి ఇద్దరు వ్యక్తులు ఒక ప్రైవేట్ సూట్‌ను పంచుకునే విధంగా రెండు రాత్రుల ప్యాకేజీ ధర 86,250 సౌదీ రియాల్స్ (సుమారు 23,000 అమెరికన్ డాలర్లు) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో వ్యాట్, రైలులో వసతి, భోజనం, గమ్యస్థానాల్లో ఆహారం, ప్రత్యేక పర్యాటక కార్యక్రమాలు కూడా ఉంటాయి.

రెండు ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలు

ప్రారంభంలో రెండు రకాల ప్రయాణ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

డెజర్ట్ కింగ్‌డమ్స్: నాలుగు రోజుల ఈ ప్రయాణంలో అల్ జౌఫ్, హైల్ ప్రాంతాలను సందర్శిస్తారు. చారిత్రక మారిద్ కోటలో ప్రత్యేక గాలా డిన్నర్‌తో పాటు అజా పర్వతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

షాడోస్ ఆఫ్ అజా: మూడు రోజుల ఈ ప్రయాణంలో హైల్, అల్ ఖాసిమ్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఎడారి విహారయాత్రలు, నక్షత్ర వీక్షణ, సాంప్రదాయ సౌదీ వంటకాలతో ప్రత్యేక అనుభూతిని అందించనున్నారు.

భవిష్యత్తులో చారిత్రక పర్యాటక ప్రాంతమైన అల్ ఉలాకు ప్రత్యేక రైలు ప్రయాణాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ చార్టర్ ప్రయాణాలకు కూడా అవకాశం కల్పించనున్నారు.

సౌదీ విజన్ 2030 లక్ష్యాల్లో భాగంగా పర్యాటక రంగాన్ని మరింత విస్తరించడం, ప్రధాన నగరాలకు అతీతంగా దేశంలోని ఇతర ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. 2027 అక్టోబర్‌లో తొలి ప్రయాణాలు ప్రారంభం కానుండగా, ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్లు స్వీకరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com