బహ్రెయిన్‌ నేషనల్ డే.. వ్యాపారులకు ప్రత్యేక రాయితీలు..!!

- November 12, 2026 , by Maagulf
బహ్రెయిన్‌ నేషనల్ డే.. వ్యాపారులకు ప్రత్యేక రాయితీలు..!!

మనామా: బహ్రెయిన్ జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. డిసెంబర్ నెలలో దుకాణాలు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సాధారణంగా చెల్లించే ప్రచార రుసుముల నుంచి మినహాయింపు కల్పించింది. అలాగే డిస్కౌంట్ ఆఫర్ల గడువును పొడిగించుకునేందుకు కూడా అనుమతించింది.

పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ ప్రత్యేక కార్యక్రమం డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటుంది. దేశంలోని అన్ని గవర్నరేట్లలో వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించడం, కొనుగోళ్లను పెంచడం, వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందించడం దీని ప్రధాన ఉద్దేశమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ ఆదెల్ ఫఖ్రో తెలిపారు. 

ప్రైవేటు రంగంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దుకాణాలు, వాణిజ్య సంస్థలకు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లు, బహుమతి పథకాలు నిర్వహించాలని అన్నారు.

ఈ పథకానికి సంబంధించిన వివరాలు, నిబంధనల కోసం ఆసక్తి ఉన్న వ్యాపార సంస్థలు [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com