సౌదీలో వినియోగదారుల హక్కుల చట్టం.. ఉల్లంఘిస్తే SR8 మిలియన్ల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష..!!
- November 12, 2026
రియాద్: సౌదీ అరేబియాలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల రక్షణ చట్టానికి మంత్రుల మండలి ఆమోదం తెలిపింది. ఉత్పత్తులు, సేవలకు సంబంధించి వినియోగదారుల హక్కులను ఒకే చట్టపరమైన వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం ఈ చట్టం ప్రత్యేకత అని నిపుణులు తెలిపారు.
ఈ చట్టం అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన 180 రోజుల తర్వాత అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న వాణిజ్య మోసాల నిరోధక చట్టం, ఈ-కామర్స్ చట్టం, వాణిజ్య డేటా చట్టం స్థానంలో కొత్త చట్టం అమలుకానుంది.
కొత్త చట్టాన్ని ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా SR8 మిలియన్ల జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయడం, నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడం, వినియోగదారులను హెచ్చరిస్తూ బహిరంగ ప్రకటనలు చేయడం వంటి చర్యలు కూడా తీసుకోనున్నారు.
అసాధారణ పరిస్థితులు, సంక్షోభాలు, మహమ్మారుల సమయంలో వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. ఇందులో తాత్కాలిక ధరల నియంత్రణ, గరిష్ఠ లాభ మార్జిన్ల నిర్ణయం, ధరలు పెంచే ముందు సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి.
వివిధ సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ఇతర సంస్థలతో పోల్చి ప్రకటనలు చేసుకునేందుకు చట్టం అనుమతిస్తుంది. దీనివల్ల వినియోగదారులు ధరలు, నాణ్యత తదితర అంశాలను పోల్చుకుని సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష దుకాణాలకు వెలుపల కుదుర్చుకునే ఉత్పత్తులు, సేవల ఒప్పందాలకూ ఈ-కామర్స్ తరహా వినియోగదారుల రక్షణ నిబంధనలు వర్తిస్తాయి. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల వంటి బలహీన వర్గాల రక్షణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఇచ్చే ప్రకటనల్లో వారి ప్రాణాలు, ఆరోగ్యం, భద్రతకు ముప్పు కలిగించే సందేశాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ చట్టం అమలులో వినియోగదారుల రక్షణ, మార్కెట్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే 20 ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేయనున్నాయి. హానికరమైన, లోపభూయిష్టమైన, నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తులు, సేవల నుంచి వినియోగదారులను కాపాడటంతో పాటు, వాటివల్ల నష్టం జరిగితే పరిహారం పొందే హక్కును కూడా ఈ చట్టం కల్పించనుంది.
తాజా వార్తలు
- ఒమన్ లాజిస్టిక్స్ రంగంలో భారీ వృద్ధి..!!
- ఖతార్‌లో 57 ఫుడ్ కేంద్రాలు మూసివేత..!!
- సౌదీలో వినియోగదారుల హక్కుల చట్టం.. ఉల్లంఘిస్తే SR8 మిలియన్ల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష..!!
- యూఏఈలో వర్షాకాలానికి షార్జా భారీ ఏర్పాట్లు..!!
- బహ్రెయిన్ నేషనల్ డే.. వ్యాపారులకు ప్రత్యేక రాయితీలు..!!
- పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ వేగానికి పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు
- SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి డాలస్ లో మహాత్మాగాంధీకి ఘన నివాళి
- గ్లోబల్ విలేజ్‌ను సందర్శించిన దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్
- నకిలీ అటెస్టేషన్ సేవల పై భారతీయులకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక
- సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్లు, క్షిపణుల దాడి యత్నం.. ధ్వంసం చేసిన సంకీర్ణ దళాలు







