ఒమన్ లాజిస్టిక్స్ రంగంలో భారీ వృద్ధి..!!

- November 12, 2026 , by Maagulf
ఒమన్ లాజిస్టిక్స్ రంగంలో భారీ వృద్ధి..!!

మస్కట్: ఒమన్ ఆర్థిక వ్యవస్థలో లాజిస్టిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ఇది ఒకటని రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఇంజినీర్ సయీద్ బిన్ హమూద్ అల్ మావాలి తెలిపారు. ఒమన్ ఎయిర్, ఇండోనేషియాకు చెందిన GMF ఏరోఏషియా మధ్య భాగస్వామ్య ఒప్పందం ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా విమానయాన రంగంలో కార్గో రవాణా, విమానాల మరమ్మతులు, నిర్వహణ సేవల ద్వారా వృద్ధి పెరుగుతోందని చెప్పారు.

ఈ ఏడాది లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదైందని, అయితే ప్రాంతీయ పరిస్థితుల కారణంగా ఈ పెరుగుదల తాత్కాలికంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఒమన్ ఎయిర్, సలామ్ ఎయిర్ సంస్థలు తమ ప్రయాణికుల విమాన సర్వీసులను పునర్వ్యవస్థీకరించాయని మంత్రి తెలిపారు. ఆదాయాన్ని పెంచడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విమాన సర్వీసులపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు. ప్రాంతీయ పరిస్థితుల కారణంగా విమాన ప్రయాణాలపై ప్రయాణికుల్లో ఆందోళన పెరిగి డిమాండ్ కొంత తగ్గినప్పటికీ, ఇతర ప్రాంతీయ దేశాలతో పోలిస్తే ఒమన్‌లో ఈ తగ్గుదల తక్కువగా ఉందని ఆయన వివరించారు.

విమానాల మరమ్మతులకు భారీ పెట్టుబడి

ఒమన్ ఎయిర్, GMF ఏరోఏషియా భాగస్వామ్యం ద్వారా విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ (MRO) సేవలను అభివృద్ధి చేయనున్నారు. మస్కట్‌ను మిడిలిస్ట్, ఆఫ్రికా ప్రాంతాలకు సేవలందించే ప్రధాన విమాన నిర్వహణ కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ఈ కార్యకలాపాల కోసం 39,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వర్క్‌షాప్ నిర్మించారు. దీనికి OMR100 మిలియన్లకు పైగా ఖర్చు చేశారు. ఒకేసారి రెండు నారో బాడీ, ఒక వైడ్ బాడీ విమానాలకు సేవలందించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని ప్రకటించారు.

ఈ కేంద్రం ద్వారా ఒమన్ జాతీయ విమానయాన సంస్థలకే కాకుండా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు కూడా విమానాల మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ సేవలు అందించవచ్చని అల్ మావాలి తెలిపారు. భవిష్యత్తులో సైనిక విమానాల నిర్వహణ సేవలను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేర్చే అవకాశముందని వెల్లడించారు.

GMF ఏరోఏషియా సంస్థకు విమానాల నిర్వహణలో ఉన్న నైపుణ్యం, ఒమన్ ఎయిర్‌కు ఉన్న నిర్వహణ అనుభవం కలవడం ఈ భాగస్వామ్యానికి బలంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఒమన్ ఆర్థిక వ్యవస్థలో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందని విమాన నిర్వహణ రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com