పర్యాటకులకు గుడ్ న్యూస్.. షార్జాలో తిరిగి తెరుచుకున్న బీచ్‌లు..!!

- November 13, 2026 , by Maagulf
పర్యాటకులకు గుడ్ న్యూస్.. షార్జాలో తిరిగి తెరుచుకున్న బీచ్‌లు..!!

షార్జా: చమురు నౌక నుంచి సముద్రంలోకి లీకైన చమురు కారణంగా తాత్కాలికంగా మూసివేసిన బీచ్‌లను షార్జా అధికారులు తిరిగి తెరిచారు. సముద్ర కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించడంతో పాటు, చమురు లీకేజీ ప్రభావాలను తొలగించినట్లు గురువారం అధికారులు ప్రకటించారు. షార్జా తీర ప్రాంతాలు, సముద్ర పర్యావరణం ప్రస్తుతం ప్రజల సందర్శనకు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. 

సమగ్ర తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ అనంతరం ప్రజారోగ్యానికి, సముద్ర జీవావరణానికి ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించినట్లు వెల్లడించారు. దీంతో బీచ్‌ల సందర్శనతో పాటు సముద్ర సంబంధిత కార్యకలాపాలకు కూడా అనుమతినిచ్చారు.ఈ ఘటనకు సంబంధించి ప్రజలు అధికారిక సమాచార మార్గాల ద్వారానే వివరాలు తెలుసుకోవాలని, నిర్ధారణ లేని వార్తలు, వదంతులను ప్రచారం చేయవద్దని అధికారులు సూచించారు. సముద్ర పర్యావరణ భద్రత కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.

కాగా, యూఏఈ తీరానికి సమీపంలో చమురు ట్యాంకర్ నుంచి లీకేజీ జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 23న అల్ హమ్రియా బీచ్‌ను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. అనంతరం అక్టోబర్ 28న షార్జా ఎమిరేట్ పరిధిలోని అన్ని బీచ్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలా ఉండగా, రాస్ అల్ ఖైమాలోనూ నవంబర్ 11న ఏడు బీచ్‌లను తిరిగి తెరిచారు. గత నెలలో మూసివేసిన పబ్లిక్ బీచ్‌లతో పాటు ప్రముఖ రిసార్టుల పరిధిలోని బీచ్‌లకు కూడా సందర్శకులను అనుమతించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23న ఉమ్ అల్ ఖువైన్ తీరానికి సమీపంలో ట్యాంకర్ నుంచి చమురు లీకైనట్లు నిర్ధారించింది. ఈ ఘటన అనంతరం పలు ఎమిరేట్లలో నివాసితులు ఇంధనం వంటి వాసన వస్తోందని ఫిర్యాదులు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com