గోల్డెన్ వీసా పేరుతో ఘరానా మోసం
- November 13, 2026
దుబాయ్: యూఏఈ గోల్డెన్ వీసా ఇప్పిస్తామంటూ ఓ పెట్టుబడిదారుడిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ సివిల్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. బాధితుడి నుంచి మోసపూరితంగా తీసుకున్న 4.4 మిలియన్ దిర్హామ్‌లను తిరిగి చెల్లించడంతో పాటు, అదనంగా 3 లక్షల దిర్హామ్‌ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా కోర్టు ఖర్చులు, న్యాయవాదుల ఫీజులు, వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
10 ఏళ్ల గోల్డెన్ వీసా పేరుతో వల
కోర్టు వివరాల ప్రకారం..ఇద్దరు వ్యక్తులు ఓ పెట్టుబడిదారుడిని సంప్రదించి, అధికారిక పెట్టుబడి మార్గాల ద్వారా పదేళ్ల కాలపరిమితి కలిగిన యూఏఈ గోల్డెన్ వీసా ఇప్పిస్తామని నమ్మబలికారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీసా పొందవచ్చని, అందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
వారి మాటలను నమ్మిన బాధితుడు మొత్తం 4.4 మిలియన్ దిర్హామ్‌లను వారికి బదిలీ చేశాడు. అయితే డబ్బు చేతికి అందిన తర్వాత నిందితులు బాధితుడితో సంబంధాలు తెంచుకున్నారు. వీసా ప్రక్రియను ప్రారంభించకుండానే ఆ మొత్తాన్ని తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు.. నిందితులకు శిక్ష
తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే దుబాయ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు లావాదేవీల వివరాలు, రాతపూర్వక సమాచారంతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన క్రిమినల్ కోర్టు ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారించింది. మోసం, ఇతరుల సొమ్మును అక్రమంగా స్వాధీనం చేసుకున్న నేరాలకు వారిని బాధ్యులుగా తేల్చింది.
బాధితుడికి Dh4.7 మిలియన్ల పరిహారం
క్రిమినల్ కోర్టు తీర్పు ఆధారంగా బాధితుడు తన డబ్బును తిరిగి పొందేందుకు దుబాయ్ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. క్రిమినల్ కోర్టు ఇచ్చిన తుది తీర్పును పరిగణనలోకి తీసుకున్న సివిల్ కోర్టు.. ఇద్దరు నిందితులే బాధితుడికి జరిగిన ఆర్థిక నష్టం, మానసిక వేదనకు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఇద్దరూ సంయుక్తంగా బాధితుడికి 4.4 మిలియన్ దిర్హామ్‌లు తిరిగి చెల్లించాలని, అదనంగా 3 లక్షల దిర్హామ్‌ల పరిహారం అందించాలని ఆదేశించింది. వీటితో పాటు వడ్డీ, కోర్టు ఖర్చులు, న్యాయపరమైన వ్యయాలను కూడా భరించాలని తీర్పునిచ్చింది.
గోల్డెన్ వీసా ఇప్పిస్తామంటూ చెప్పే వ్యక్తులు, మధ్యవర్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గాల ద్వారానే వీసా ప్రక్రియను నిర్ధారించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
తాజా వార్తలు
- పెన్షన్ పొందే వయోపరిమితి పెంపునకు షురా కౌన్సిల్ బ్రేక్..!!
- యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!
- కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!
- భారత్‌లో 31వ CII భాగస్వామ్య సదస్సులో యూఏఈ ప్రతినిధి బృందం
- క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము సత్కారం..
- యూఏఈ నేషనల్ డే సెలవులు ప్రకటన..
- నగర ప్రజలకు, సిబ్బందికి కృతజ్ఞతలు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం
- గోల్డెన్ వీసా పేరుతో ఘరానా మోసం
- టీ20 లీగ్‌లకు ఐసీసీ కొత్త రూల్స్..
- పర్యాటకులకు గుడ్ న్యూస్.. షార్జాలో తిరిగి తెరుచుకున్న బీచ్‌లు..!!







