టీ20 లీగ్‌లకు ఐసీసీ కొత్త రూల్స్..
- November 13, 2026
ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాటిపై మరింత నియంత్రణ తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తోంది. లీగ్‌ల సంఖ్య పెరగడం, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌పై ప్రభావం పడటం, అవినీతి ఆరోపణలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలను రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనలపై బాలిలో జరగనున్న ఐసీసీ త్రైమాసిక సమావేశంలో వివిధ దేశాల క్రికెట్ బోర్డుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు చర్చించనున్నారు.
తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో సమీక్షా కమిటీ
బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో ఏర్పాటైన సమీక్షా కమిటీ ఫ్రాంచైజీ లీగ్‌ల నియంత్రణకు సంబంధించి పలు సిఫార్సులు చేసింది. ఈ బృందంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతినిధి రిచర్డ్ గౌల్డ్, క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన టాడ్ గ్రీన్‌బర్గ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల నిర్వహణ, ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురికే విదేశీ ఆటగాళ్లు?
కమిటీ చేసిన ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటి విదేశీ ఆటగాళ్ల సంఖ్యపై పరిమితి విధించడం. ప్రతి లీగ్‌లోనూ తుది జట్టులో గరిష్ఠంగా నలుగురు విదేశీ ఆటగాళ్లకే అవకాశం కల్పించాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20)లో గరిష్ఠంగా తొమ్మిది మంది, అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే ఈ రెండు లీగ్‌లపై ప్రభావం పడనుంది. స్థానిక ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సి రావడంతో జట్ల కూర్పు, లీగ్‌ల పోటీతత్వం, వాణిజ్య విలువలో మార్పులు రావచ్చని అంచనా.
లీగ్‌ల అనుమతుల్లో ఐసీసీకి మరిన్ని అధికారాలు
ఫ్రాంచైజీ లీగ్‌లకు అనుమతులు ఇచ్చే విధానంలోనూ మార్పులు తీసుకురావాలని సమీక్షా కమిటీ సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల క్రికెట్ బోర్డులే తమ పరిధిలోని లీగ్‌లకు అనుమతులు ఇస్తున్నాయి. అయితే ఇకపై ఈ అనుమతులను సమీక్షించడంతో పాటు, అవసరమైతే రద్దు చేసే అధికారం కూడా ఐసీసీకి ఉండాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే లీగ్‌లలో పారదర్శకత పెంచేందుకు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) పర్యవేక్షణను తప్పనిసరి చేయాలని సూచించింది. బెట్టింగ్ కంపెనీలు లేదా వాటి అనుబంధ సంస్థల నుంచి వచ్చే స్పాన్సర్‌షిప్‌లపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిర్ణయం అమలైతే దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్ఏ20తో పాటు ఇతర లీగ్‌ల ఆదాయ మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ICC New Rules: లీగ్ నిర్వాహకుల నుంచి వ్యతిరేకత
ఐసీసీ ప్రతిపాదనలపై ఫ్రాంచైజీ లీగ్‌ల వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొనసాగుతున్న లీగ్‌లకు పాత నిబంధనలే వర్తిస్తాయన్న భరోసా గతంలో లభించిందని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నట్లు కథనాలు చెబుతున్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా విదేశీ ఆటగాళ్ల సంఖ్యను తగ్గిస్తే లీగ్‌ల నిర్వహణ కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ అంశాల పై చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సమగ్రంగా చర్చించిన తర్వాత, తుది నిర్ణయం కోసం ఐసీసీ బోర్డుకు సిఫార్సులు పంపనుంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపిన తర్వాతే వీటి అమలుపై స్పష్టత రానుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- పెన్షన్ పొందే వయోపరిమితి పెంపునకు షురా కౌన్సిల్ బ్రేక్..!!
- యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!
- కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!
- భారత్‌లో 31వ CII భాగస్వామ్య సదస్సులో యూఏఈ ప్రతినిధి బృందం
- క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము సత్కారం..
- యూఏఈ నేషనల్ డే సెలవులు ప్రకటన..
- నగర ప్రజలకు, సిబ్బందికి కృతజ్ఞతలు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం
- గోల్డెన్ వీసా పేరుతో ఘరానా మోసం
- టీ20 లీగ్‌లకు ఐసీసీ కొత్త రూల్స్..







