నగర ప్రజలకు, సిబ్బందికి కృతజ్ఞతలు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం
- November 13, 2026
హైదరాబాద్: గడచిన ఏడాది కాలం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన ప్రయాణం. చారిత్రక హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని సజ్జనార్ పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్న మహేశ్ భగవత్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది కాలంలో నగర ప్రజలు నాపై, మా పోలీస్ వ్యవస్థ పై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. మేము చేపట్టిన ప్రతి సంస్కరణనూ తమ సొంత కార్యక్రమంగా భావించి ఆదరించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలంతా కలిసిమెలిసి ప్రతి పండుగనూ ఘనంగా జరుపుకున్న తీరు నా మనసును కదిలించింది అని ఆయన అన్నారు.
గత ఏడాది కాలంలో చేపట్టిన కీలక సంస్కరణలు
ప్రజల క్షేమమే పరమావధిగా తాము చేపట్టిన పలు కీలక కార్యక్రమాలను సజ్జనార్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ ద్వారా కఠిన చర్యలు తీసుకున్నామని, ఫుడ్ సేఫ్టీ అధికారుల సహకారంతో భారీగా కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి నిందితులను కటకటాల వెనక్కి నెట్టామన్నారు. బ్యాంకులు, టెలికాం విభాగం (DoT) సమన్వయంతో దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ప్రారంభించామని, దీనిపై కేంద్ర హోం సెక్రటరీ ప్రత్యేకంగా స్పందించి హైదరాబాద్ పోలీసుల సలహాలను స్వీకరించడం గర్వకారణమని పేర్కొన్నారు. బాధితులకు వేగంగా న్యాయం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పోలీసుల పట్ల భయం పోగొట్టేందుకు ‘డే విత్ సీపీ’ కార్యక్రమాలు ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చాయన్నారు. జీహెచ్‌ఎంసీ సహకారంతో దశాబ్దాల నాటి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమలు చేసి ట్రాఫిక్ సమస్యను తగ్గించామని, మహిళల రక్షణ కోసం ‘స్పందన’ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
పోలీస్ సిబ్బంది, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు
ఉత్తమ సిబ్బంది కోసం ‘ఎక్స్‌ట్రా మైల్’, వారి ఆరోగ్యం కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ వంటి కార్యక్రమాలు చేపట్టామని సజ్జనార్ తెలిపారు. పండుగైనా, పబ్బమైనా కుటుంబాలను పక్కనపెట్టి రోడ్లపై శ్రమించిన హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీల వరకు ప్రతి ఒక్కరికీ, నిరంతరం మార్గదర్శనం చేసిన డీజీపీ, ఉన్నతాధికారులకు, వెన్నంటి నిలిచిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
హైదరాబాద్ ప్రజలందరూ సదా సురక్షితంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో హైదరాబాద్ సీపీగా ఇక సెలవు తీసుకుంటున్నాను అంటూ సజ్జనార్ తన పోస్ట్‌ను ముగించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- పెన్షన్ పొందే వయోపరిమితి పెంపునకు షురా కౌన్సిల్ బ్రేక్..!!
- యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!
- కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!
- భారత్‌లో 31వ CII భాగస్వామ్య సదస్సులో యూఏఈ ప్రతినిధి బృందం
- క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము సత్కారం..
- యూఏఈ నేషనల్ డే సెలవులు ప్రకటన..
- నగర ప్రజలకు, సిబ్బందికి కృతజ్ఞతలు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం
- గోల్డెన్ వీసా పేరుతో ఘరానా మోసం
- టీ20 లీగ్‌లకు ఐసీసీ కొత్త రూల్స్..







