అబుదాబి హోటల్‌లో ఘర్షణ.. 8 మందికి 6 నెలల జైలు..!!

- November 14, 2026 , by Maagulf
అబుదాబి హోటల్‌లో ఘర్షణ.. 8 మందికి 6 నెలల జైలు..!!

అబుదాబి: అబుదాబిలోని ఓ హోటల్ ఎంట్రీ వద్ద జరిగిన ఘర్షణ ఘటనపై న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంది. ఈ కేసులో మొత్తం 10 మందిని దోషులుగా నిర్ధారిస్తూ అబుదాబి క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో కొందరికి జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించడంతో పాటు దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

నవంబర్ 13న వెలువడిన తీర్పు ప్రకారం.. ఘర్షణకు పాల్పడిన ఆరుగురికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఒక్కొక్కరికి Dh300,000 జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ప్రజా భద్రతకు విఘాతం కలిగించడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి అభియోగాలపై ఈ శిక్షలు విధించారు. మరో ఇద్దరికి ప్రజా శాంతికి భంగం కలిగించడం, ఇతరులపై దాడికి పాల్పడినందుకు ఒక్కొక్కరికి Dh50,000 జరిమానా విధించారు.

ఈ ఘర్షణ దృశ్యాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన మరో ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి Dh300,000 జరిమానా విధించారు. వారిని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వీడియోలు చిత్రీకరించడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని, సంబంధిత వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ప్రజా భద్రతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అబుదాబి అధికారులు స్పష్టం చేశారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఇతరుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ ఘటనపై RAF సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చాడ్ బ్రోన్‌స్టెయిన్ స్పందిస్తూ.. ఇలాంటి చర్యలను తమ సంస్థ సమర్థించదని తెలిపారు. యూఏఈ అధికారులతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com