బహ్రెయిన్‌లో మనామా–ముహర్రఖ్ మధ్య రాకపోకలకు ఊరట..!!

- November 14, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో మనామా–ముహర్రఖ్ మధ్య రాకపోకలకు ఊరట..!!

మనామా: బహ్రెయిన్‌లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు రాజధాని మనామా, ముహర్రఖ్ ప్రాంతాలను కలుపుతూ నాలుగో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రోజువారీ ప్రయాణాలు సులభతరం కావడంతో పాటు రద్దీ సమస్య తగ్గనుంది. అల్ సయా (Al Sayah) ప్రాంతాన్ని మనామాలోని బహ్రెయిన్ బే (Bahrain Bay)తో అనుసంధానిస్తూ ఈ కొత్త బ్రిడ్జి నిర్మించనున్నారు. 

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి ఉప ప్రధాని షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా హాజరయ్యారు. ప్రభుత్వ తరఫున వర్క్స్ మంత్రి ఇబ్రహీం అల్ హవాజ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. నాస్ కార్పొరేషన్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ నిర్మాణ పనులను చేపట్టనుంది. గల్ఫ్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సౌదీ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాంతీయ మద్దతు లభించనుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా 482 మీటర్ల పొడవైన సముద్ర బ్రిడ్జి నిర్మించనున్నారు. దీనికి ఇరువైపులా ఐదు చొప్పున మొత్తం పది లేన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రద్దీ సమయాల్లో వాహనదారులకు ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. అలాగే అల్ ఫతేహ్ హైవే (Al Fateh Highway)తో అనుసంధానించేలా మూడు లేన్లతో ప్రత్యేక యూ-టర్న్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

బహ్రెయిన్‌లో వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com