బహ్రెయిన్‌లో విదేశీ డ్రైవర్లకు షాక్..!!
- November 15, 2026
మనామా: బహ్రెయిన్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే విదేశీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఇప్పటికే ప్రభుత్వానికి ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే విదేశీయులను కోర్టు ఆదేశాలు లేకుండానే దేశం నుంచి బహిష్కరించవచ్చని పార్లమెంట్ సభ్యులకు తెలిపింది. ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విదేశీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది.
ఎమ్మెల్యే ఈమాన్ షువైటర్ ప్రతిపాదించిన ఈ అంశానికి పార్లమెంట్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, జాతీయ భద్రతా కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. తీవ్రమైన ట్రాఫిక్ నేరాలకు పాల్పడిన విదేశీ డ్రైవర్లు శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత వారిని బహిష్కరించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా అలా బహిష్కరించిన డ్రైవర్లు తిరిగి బహ్రెయిన్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని కోరారు.
కోర్టు ఆదేశాలు లేకుండానే బహిష్కరణకు అవకాశం
విదేశీయుల వలసలు, నివాస చట్టంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే విదేశీయులను దేశం నుంచి బహిష్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని అంతర్గత వ్యవహారాల శాఖ వివరించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కూడా అవసరాన్ని బట్టి ఈ అధికారాలను వినియోగించవచ్చని పేర్కొంది.
మరోవైపు, క్రిమినల్ నేరాల్లో దోషులుగా తేలిన విదేశీయులను బహిష్కరించే అధికారం న్యాయస్థానాలకు కూడా ఉంది. పెనల్ కోడ్‌లోని ఆర్టికల్ 64 బిఐస్ ప్రకారం విదేశీయులను శాశ్వతంగా లేదా కనీసం మూడు సంవత్సరాల పాటు దేశం నుంచి బహిష్కరించవచ్చు. ఆర్టికల్ 111 ప్రకారం 2014 ట్రాఫిక్ చట్టం కింద నమోదయ్యే నేరాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
ప్రతి ట్రాఫిక్ నేరానికి బహిష్కరణ అవసరమా?
అయితే ప్రతి ట్రాఫిక్ నేరానికి బహిష్కరణను తప్పనిసరి చేయడంపై అంతర్గత వ్యవహారాల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా ట్రాఫిక్ నేరాలు నిర్లక్ష్యం కారణంగా జరుగుతాయని, తీవ్రమైన క్రిమినల్ నేరాల్లో ఉద్దేశపూర్వక చర్యలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. అలాంటి తీవ్రమైన నేరాల్లో కూడా బహిష్కరణపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ న్యాయమూర్తులకు ఉన్నప్పుడు, ట్రాఫిక్ నేరాలన్నింటికీ బహిష్కరణను తప్పనిసరి చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది.
న్యాయశాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నేరం తీవ్రత, దాని వల్ల జరిగిన నష్టం ఆధారంగా విదేశీ డ్రైవర్లను బహిష్కరించే అధికారం ఇప్పటికే కోర్టులకు ఉందని తెలిపింది. అయితే ఈ అంశంపై ప్రభుత్వ తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉందని అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇచ్చిన సమాధానం ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది.
విదేశీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రమాదకరంగా వాహనాలు నడిపే కొందరు విదేశీ డ్రైవర్ల కారణంగా మరణాలు, తీవ్ర గాయాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎంపీ ఈమాన్ షువైటర్ పేర్కొన్నారు. ఇతర వాహనదారులు, ప్రజల భద్రత కోసం ఇలాంటి వారిని దేశం నుంచి బహిష్కరించడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
తీవ్రమైన ట్రాఫిక్ నేరాలకు పాల్పడే విదేశీ డ్రైవర్లను బహిష్కరించడం నివారణ, భద్రతా చర్యల్లో ఒకటని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటరీ కమిటీ ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..
- బహ్రెయిన్‌లో విదేశీ డ్రైవర్లకు షాక్..!!
- ఒమన్‌లో పర్సనల్ స్టేటస్ చట్టంలో కీలక నిబంధనలు..!!
- ద్వైపాక్షిక సహకారంపై సౌదీ–అమెరికా చర్చలు..!!
- యూఏఈ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారత రాయబారి..!!
- ఖతార్‌లో పాస్‌పోర్టు, ఐడీ కార్డులు పోగొట్టుకున్నారా?
- శాంతి స్థాపనలో యూఎన్ఓ మిషన్ల పాత్ర కీలకం: కువైట్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ భేటీ
- టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
- బహ్రెయిన్ సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు..!!







