హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

- November 15, 2026 , by Maagulf
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ పార్కింగ్ యార్డులో నిలిపి ఉంచిన ఐదు ట్రావెల్స్ బస్సులు మంటలకు గురయ్యాయి. ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఒక బస్సులో మొదలై.. ఐదింటికి వ్యాపించిన మంటలు

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్రాయి సమీపంలో ఉన్న ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులను ఒకదానికొకటి దగ్గరగా నిలిపి ఉంచడంతో ఒక బస్సులో చెలరేగిన మంటలు వేగంగా పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం ఐదు బస్సులు అగ్నిప్రమాదానికి గురయ్యాయి.

అప్రమత్తమైన స్థానికులు.. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

అర్ధరాత్రి సమయంలో పార్కింగ్ యార్డు నుంచి దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సమీపంలోని పెట్రోల్ బంక్ సిబ్బందితో కలిసి అగ్నిమాపక కేంద్రం, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

షార్ట్ సర్క్యూట్ కారణమా? పోలీసుల దర్యాప్తు

ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరోవైపు పార్కింగ్ స్థలానికి సమీపంలోని చెత్తకుప్పకు నిప్పు అంటుకుని మంటలు బస్సులకు వ్యాపించాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. దగ్ధమైన బస్సుల వల్ల జరిగిన ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com