ఫుజైరా ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల్లో 13 ఏళ్ల భారతీయ బాలుడు..
- November 15, 2026
ఫుజైరా: ఫుజైరాలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 14 మందిలో నలుగురు భారతీయులు ఉన్నట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ధృవీకరించింది. మృతుల్లో 13 ఏళ్ల భారతీయ బాలుడు కూడా ఉన్నట్లు తాజాగా వెల్లడైంది.
ఫుజైరా ఇండియన్ సెంటర్‌కు చెందిన సామాజిక కార్యకర్త తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం యూఏఈ పర్యటనకు వచ్చి తిరిగి భారత్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఫుజైరా విమానాశ్రయానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా, అతడి తల్లిదండ్రులు, అక్క తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబంతో పాటు ప్రయాణిస్తున్న పాకిస్థానీ డ్రైవర్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సామాజిక కార్యకర్త వెల్లడించారు.
అక్టోబర్ 6న ఈ కుటుంబం యూఏఈకి పర్యటన నిమిత్తం వచ్చినట్లు తెలిపారు. ప్రమాదం అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఫుజైరా ఇండియన్ సెంటర్ ప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లారు. బాలుడి మృతదేహాన్ని యూఏఈలోనే ఖననం చేయాలా? లేక భారత్‌కు తరలించాలా? అనే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అవసరమైన పత్రాల ప్రక్రియను పూర్తి చేసేందుకు బాలుడి ఇద్దరు మేనమామలు గుజరాత్ నుంచి యూఏఈకి చేరుకున్నారు.
23 వాహనాలు ఢీకొన్న ప్రమాదం.. 14 మంది మృతి
ఫుజైరాలో షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై (E84) జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో మొత్తం 23 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు.
మృతుల్లో 10 మంది యూఏఈ పౌరులు, నలుగురు భారతీయులు ఉన్నారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది ఎమిరేటీలు, ఏడుగురు భారతీయులు, ఆరుగురు ఒమానీలు, ముగ్గురు ఈజిప్షియన్లు, ఇద్దరు జోర్డానియన్లు, ఇద్దరు పాకిస్థానీలు, ఇద్దరు బ్రెజిల్‌కు చెందినవారు ఉన్నారు.
రెండు వరుస ప్రమాదాలతో విషాదం
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
మొదటి ప్రమాదంలో ఓ వాహనం నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 ఏళ్ల కవలలు మహమ్మద్, మిస్నా, వారి మూడేళ్ల మేనల్లుడు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వారి అంత్యక్రియలు నిర్వహించగా, వందలాది మంది పాల్గొని నివాళులర్పించారు.
శనివారం ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ హమద్ అల్ షర్కీ మృతుల తండ్రి సిద్ధిఖ్ టుబ్లికాట్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండో ప్రమాదంలో రెండు షిప్పింగ్ కంటైనర్లతో వెళ్తున్న ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.
ట్రక్కు డ్రైవర్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని విచారించిన అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాల మేరకు పాక్షిక నిర్బంధంలో ఉంచారు.
ఈ ఘోర ప్రమాదం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధ్యత వహించాల్సిన అంశాలపై విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఫుజైరా ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల్లో 13 ఏళ్ల భారతీయ బాలుడు..
- హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..
- బహ్రెయిన్‌లో విదేశీ డ్రైవర్లకు షాక్..!!
- ఒమన్‌లో పర్సనల్ స్టేటస్ చట్టంలో కీలక నిబంధనలు..!!
- ద్వైపాక్షిక సహకారంపై సౌదీ–అమెరికా చర్చలు..!!
- యూఏఈ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారత రాయబారి..!!
- ఖతార్‌లో పాస్‌పోర్టు, ఐడీ కార్డులు పోగొట్టుకున్నారా?
- శాంతి స్థాపనలో యూఎన్ఓ మిషన్ల పాత్ర కీలకం: కువైట్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ భేటీ
- టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత







