డిసెంబర్ తొలి వారంలో పార్లమెంటు సమావేశాలు!

- November 15, 2026 , by Maagulf
డిసెంబర్ తొలి వారంలో పార్లమెంటు సమావేశాలు!

న్యూ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి? ఎన్ని రోజుల పాటు కొనసాగించాలి? అనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. తేదీల ఖరారుపై ప్రభుత్వం వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ శీతాకాల సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

డీలిమిటేషన్‌తో ముడిపెట్టి రాజ్యాంగ సవరణ బిల్లు!

ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెడుతూ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. దీంతో ఈ బిల్లు ఆమోదానికి మిత్రపక్షాల మద్దతు కేంద్ర ప్రభుత్వానికి కీలకం కానుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సహకారంతో బిల్లును సులభంగా గట్టెక్కించగలమని కేంద్రం ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. దీంతో రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com