తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌.. లోగో ఆవిష్కరించిన మోదీ

- November 15, 2026 , by Maagulf
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌.. లోగో ఆవిష్కరించిన మోదీ

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ (Khelo India Youth Games) 8వ ఎడిషన్‌కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ లోగోను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న ఈ క్రీడా సంబరానికి హాజరుకావాలని ప్రధాని మోదీని వారు సాదరంగా ఆహ్వానించారు.

డిసెంబర్ 11 నుంచి ప్రారంభం – 5 నగరాల్లో క్రీడా వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 22 వరకు, సుమారు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,000 మందికి పైగా యువ అథ్లెట్లు, 1,800 మంది సపోర్ట్ స్టాఫ్ పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు లాల్ బహదూర్ శాస్త్రి (LB) స్టేడియం ప్రధాన వేదికలుగా 22 పతక క్రీడలు జరగనుండగా, మిగిలిన పోటీలు రాష్ట్రంలోని మరో ఐదు నగరాలకు విస్తరించాయి.

  • ఖమ్మం: ఆర్చరీ
  • హనుమకొండ: అథ్లెటిక్స్
  • కరీంనగర్: జూడో
  • నిజామాబాద్: టేబుల్ టెన్నిస్
  • మహబూబ్‌నగర్: కబడ్డీ

Khelo India Youth Games 2026: ప్రత్యేక ఆకర్షణగా సాఫ్ట్‌బాల్ మరియు రోయింగ్

ఈ ఏడాది నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో మొత్తం 27 పోటీ క్రీడలతో పాటు ఒక డెమాన్‌స్ట్రేషన్ స్పోర్ట్ అందుబాటులో ఉంది. ఈ ఎడిషన్‌లో ప్రత్యేకంగా ‘సాఫ్ట్‌బాల్’ తొలిసారిగా పోటీ క్రీడల జాబితాలో చేరడం విశేషం. అలాగే ‘రోయింగ్’ కూడా కొత్తగా చోటు దక్కించుకుంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, రెజ్లింగ్, యోగాసనాలు, మల్లాఖంబ్, గత్కా వంటి సాంప్రదాయ క్రీడలతో పాటు మొత్తం 27కి పైగా గేమ్స్ ఈ టోర్నమెంట్‌లో హోరాహోరీగా సాగనున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా మహారాష్ట్ర బరిలోకి..
గత ఏడాది బీహార్ వేదికగా ముగిసిన 7వ ఎడిషన్‌లో మహారాష్ట్ర జట్టు ఏకంగా 58 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని ఓవరాల్ ఛాంపియన్‌గా అవతరించింది. వరుసగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయిన ఆ జట్టు, ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాతోనే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనుంది. డిసెంబర్ 11న గచ్చిబౌలి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభంకానున్న ఈ క్రీడల ద్వారా తెలంగాణలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాలు) మరింత మెరుగుపడటంతో పాటు, స్థానిక యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే సువర్ణావకాశం లభిస్తుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com