యూఏఈలో 2027లో తగ్గనున్న కొత్త నియామకాలు..!!

- November 16, 2026 , by Maagulf
యూఏఈలో 2027లో తగ్గనున్న కొత్త నియామకాలు..!!

యూఏఈలో 2027లో తగ్గనున్న కొత్త నియామకాలు..!!

దుబాయ్: యూఏఈలో పనిచేస్తున్న ఉద్యోగులకు 2027లో సగటున 2.8 శాతం జీతాల పెంపు లభించే అవకాశం ఉందని తాజా నివేదిక వెల్లడించింది. అయితే చాలా సంస్థలు జీతాలను యథాతథంగా కొనసాగించడం లేదా 1 నుంచి 5 శాతం మధ్య పెంచాలని యోచిస్తున్నాయి. మరోవైపు కొత్త ఉద్యోగుల నియామకాల విషయంలో కంపెనీలు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రిక్రూట్‌మెంట్ సంస్థ కూపర్ ఫిచ్ విడుదల చేసిన ‘యూఏఈ శాలరీ గైడ్ 2027’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గల్ఫ్ ప్రాంతంలోని 1,091కుపైగా సంస్థలు, 500,000 మందికి పైగా ఉద్యోగులకు సంబంధించిన వివరాలతో ఈ సర్వే నిర్వహించారు.

ఈ నివేదిక ప్రకారం.. 2027లో 88 శాతం సంస్థలు జీతాలను పెంచడం లేదా ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలని భావిస్తున్నాయి. ఇందులో 77 శాతం సంస్థలు జీతాలను యథాతథంగా ఉంచడం లేదా 1 నుంచి 5 శాతం వరకు పెంచాలని నిర్ణయించుకున్నాయి. 2027లో జీతాల పెంపు చేపట్టాలని భావిస్తున్న సంస్థల వాటా 46 శాతంగా ఉంది. 2026లో ఇది 43 శాతంగా ఉండటం గమనార్హం. మరో 42 శాతం సంస్థలు జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపాయి. 12 శాతం సంస్థలు జీతాలను తగ్గించే అవకాశముందని వెల్లడించాయి. అయితే యూఏఈలో వాస్తవ జీతాల పెంపు 2.8 శాతం కంటే ఎక్కువగా ఉండవచ్చని కూపర్ ఫిచ్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ ట్రెఫోర్ మర్ఫీ అభిప్రాయపడ్డారు. ఇది 4 శాతానికి చేరే అవకాశముందని పేర్కొన్నారు.

ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఎక్కువ పెంపు

ఉద్యోగుల హోదాను బట్టి జీతాల పెంపు అంచనాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. సీఈఓలు, బోర్డు సభ్యుల్లో 68 శాతం మంది జీతాల పెంపును ఆశిస్తున్నారు. డైరెక్టర్లలో 49 శాతం, మిడిల్ మేనేజర్లలో 36 శాతం, సాధారణ ఉద్యోగుల్లో 19 శాతం మంది పెంపు ఉంటుందని భావిస్తున్నారు. సీఈఓలు, బోర్డు సభ్యుల్లో 21 శాతం మంది 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ జీతాల పెంపును ఆశిస్తుండగా, అన్ని స్థాయిల ఉద్యోగులను కలిపి చూస్తే ఈ వాటా కేవలం 3 శాతంగా ఉంది.

ఐటీ, టెలికాం రంగాల్లో ఎక్కువ అవకాశాలు

ఇక రంగాల వారీగా చూస్తే ఐటీ విభాగంలో అత్యధికంగా 63 శాతం సంస్థలు జీతాలు పెంచాలని భావిస్తున్నాయి. టెలికాం రంగంలో 60 శాతం, హెవీ ఇండస్ట్రీ, తయారీ రంగాల్లో 59 శాతం సంస్థలు జీతాల పెంపునకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో 54 శాతం, రిటైల్, ఈ-కామర్స్, లగ్జరీ వస్తువుల రంగాల్లో 53 శాతం సంస్థలు జీతాలు పెంచే అవకాశముంది. ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో మాత్రం 70 శాతం జీతాల్లో మార్పు ఉండదని తెలిపాయి.

కొత్త ఉద్యోగాల నియామకాలు తగ్గే సూచనలు

2027లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్న సంస్థల వాటా 42 శాతానికి పడిపోయింది. గత ఏడాది సర్వేలో ఇది 48 శాతంగా ఉంది. మరో 32 శాతం సంస్థలు ఉద్యోగుల సంఖ్యలో మార్పు ఉండదని చెప్పగా, 26 శాతం సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశముందని వెల్లడించాయి. మొత్తంగా ఉద్యోగుల సంఖ్యలో సగటు పెరుగుదల కేవలం 0.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు.

రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఆర్కిటెక్చర్ రంగాల్లో 67 శాతం సంస్థలు కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నాయి. రిటైల్, ఈ-కామర్స్ రంగాల్లో 60 శాతం, బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో 54 శాతం, ఐటీ, లాజిస్టిక్స్ రంగాల్లో 53 శాతం సంస్థలు నియామకాలకు ప్రణాళికలు రూపొందించాయి. టెలికాం రంగంలో కేవలం 10 శాతం, హెల్త్‌కేర్, ఫార్మా, బయోటెక్ రంగాల్లో 8 శాతం సంస్థలు మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెంచాలని భావిస్తున్నాయి.

ప్రతిభావంతులకు ఫుల్ డిమాండ్

2027లో తమ అవసరాలకు సరిపడా నైపుణ్యం కలిగిన ఉద్యోగులు స్థానిక మార్కెట్‌లో అందుబాటులో ఉన్నారని 64 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. 25 శాతం సంస్థలు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందని తెలిపాయి. మరో 11 శాతం సంస్థలు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ముఖ్యంగా ఏవియేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో 60 శాతం సంస్థలు నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నాయి.

ఐటీ, హాస్పిటాలిటీ రంగాల్లో ఈ సమస్య 40 శాతంగా ఉంది. అలాగే సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఉద్యోగాల భర్తీ అతిపెద్ద సవాలుగా ఉందని 20 శాతం సంస్థలు తెలిపాయి. టెక్నికల్, ఇంజినీరింగ్ ఉద్యోగాలకు 15 శాతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా, టెక్నాలజీ నైపుణ్యాలకు 10 శాతం సంస్థలు డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నాయి. 2027లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు మంచి డిమాండ్ ఉండవచ్చని ట్రెఫోర్ మర్ఫీ తెలిపారు. ముఖ్యంగా ఏఐ కన్సల్టింగ్, ఆర్థిక ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని అంచనా వేశారు.

ఉద్యోగుల పనితీరుపై ఏఐ ప్రభావం

సంస్థల్లో ఉద్యోగుల పనితీరును అంచనా వేసే విధానాలను ఏఐ, ఆటోమేషన్ ఇప్పటికే మార్చాయని 29 శాతం సంస్థలు తెలిపాయి. మరో 31 శాతం సంస్థలు ఇలాంటి మార్పులను పరిశీలిస్తున్నాయి. మొత్తంగా యూఏఈ ఉద్యోగ మార్కెట్‌లో జీతాల పెంపుపై కొంత సానుకూలత కనిపిస్తున్నప్పటికీ, కొత్త నియామకాల విషయంలో సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com