కువైట్‌లో 30 శాతం పెరిగిన రెంట్స్..!!

- November 21, 2026 , by Maagulf
కువైట్‌లో 30 శాతం పెరిగిన రెంట్స్..!!

కువైట్ : కువైట్‌లో ప్రవాస కార్మికులకు వసతి కల్పించేందుకు కంపెనీల నుంచి డిమాండ్ పెరగడంతో పెట్టుబడి భవనాల ధరలు, ఇళ్ల అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జలీబ్ అల్ షుయూఖ్ ప్రాంతం నుంచి కార్మికులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తుండటంతో దక్షిణ కువైట్‌లోని మహబూలా, మంగాఫ్, ఫింటాస్, ఫహాహీల్ ప్రాంతాల్లో అద్దెలకు డిమాండ్ పెరిగింది.

2026 ప్రారంభం నుంచి నవంబర్ 9 వరకు కువైట్‌లో పెట్టుబడి ఆస్తుల విక్రయాలు సుమారు KD 774.33 మిలియన్లకు చేరుకున్నాయి. మొత్తం 438 లావాదేవీలు నమోదయ్యాయి. కార్మికుల వసతి కోసం భవనాలు, అపార్ట్‌మెంట్లకు డిమాండ్ పెరగడం రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది.

రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షుడు ఇబ్రహీం అల్ అవాధి మాట్లాడుతూ.. ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు ఉన్నప్పటికీ పెట్టుబడి భవనాల కొనుగోళ్లు, విక్రయాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టుల కారణంగా విదేశాల నుంచి కార్మికులను తీసుకువచ్చే కంపెనీలు వారికి వసతి కల్పించేందుకు పెద్ద సంఖ్యలో భవనాలు, అపార్ట్‌మెంట్ల కోసం అన్వేషిస్తున్నాయని వివరించారు. అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పెట్టుబడి భవనాల సంఖ్య పరిమితంగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

జలీబ్ అల్ షుయూఖ్ ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో అక్కడి నుంచి కొంతమంది కార్మికులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో మహబూలా, మంగాఫ్, ఫహాహీల్, ఫింటాస్ ప్రాంతాల్లో డిమాండ్ మరింత పెరిగింది. ముఖ్యంగా గత ఆరు నెలల్లో మహబూలాలో ఆస్తుల ధరలు గణనీయంగా పెరిగాయని, అక్కడ పెట్టుబడులపై సుమారు 7 శాతం రాబడి లభిస్తోందని తెలిపారు.

అద్దెలు KD 250 నుంచి KD 330 వరకు పెరుగుదల

రియల్ ఎస్టేట్ నిపుణుడు సులేమాన్ అల్ దులైజాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూలా, మంగాఫ్‌లోని కొన్ని ప్రాంతాల్లో గత ఏడాది కాలంలో ఇంటి అద్దెలు సుమారు 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. గతంలో నెలకు KD 250గా ఉన్న అద్దెలు ప్రస్తుతం KD 300 నుంచి KD 330 వరకు చేరుకున్నాయని తెలిపారు. కార్మికులకు వసతి కల్పించేందుకు కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్, జలీబ్ అల్ షుయూఖ్ నుంచి ఇతర ప్రాంతాలకు కార్మికుల తరలింపు, పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్‌పవర్ విధిస్తున్న నిబంధనలు, పెట్టుబడి భవనాలు, అపార్ట్‌మెంట్ల కొరత వంటివి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొన్నారు.

అలాగే రాజధాని ప్రాంతానికి సమీపంలోని ఆస్తుల ధరలు పెరగడం, నివాస గృహాల రంగం నుంచి పెట్టుబడులు అద్దె ఆదాయం వచ్చే భవనాల వైపు మళ్లడం కూడా ఈ మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి. చిన్న పెట్టుబడిదారులకు కూడా అవకాశాలు అందుబాటులో ఉండటం, కొన్ని ప్రాంతాల్లో 7 శాతం వరకు పెట్టుబడి రాబడి లభిస్తుండటంతో దక్షిణ కువైట్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com