ఖతార్‌లో నవంబర్ 26, 27 తేదీల్లో ‘పాసేజ్ టు ఇండియా 2026’..!!

- November 21, 2026 , by Maagulf
ఖతార్‌లో నవంబర్ 26, 27 తేదీల్లో ‘పాసేజ్ టు ఇండియా 2026’..!!

దోహా: ఖతార్, భారత్ మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహబంధాన్ని పెంపొందించే లక్ష్యంతో ‘పాసేజ్ టు ఇండియా 2026’ వేడుకలు నిర్వహించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సంగీతం, నృత్యాలు, ఆహార వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ రెండు రోజుల ఉత్సవం నవంబర్ 26, 27 తేదీల్లో దోహాలోని ఐడియల్ ఇండియన్ స్కూల్ ప్రాంగణంలో జరగనుంది.

భారతీయ సాంస్కృతిక కేంద్రం (ICC), భారత రాయబార కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెస్టిన్ దోహా హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖతార్‌లో భారత రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పాసేజ్ టు ఇండియా 2026’ కేవలం ఒక సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే గొప్ప వేదిక అని పేర్కొన్నారు.

ఖతార్‌లో నివసిస్తున్న 800,000 మందికి పైగా భారతీయులు ఆ దేశ అభివృద్ధికి అందిస్తున్న సేవలు, స్థానికులతో కొనసాగిస్తున్న సత్సంబంధాలు రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని రాయబారి తెలిపారు. ఇలాంటి వేడుకల ద్వారా భారతీయ సంస్కృతి, భాషలు, సంప్రదాయాలు, కళలు, హస్తకళలను ఇతర దేశాల ప్రజలకు పరిచయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఖతార్ పౌరులు, ఇతర దేశాల ప్రవాసులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు.

19 రాష్ట్రాల సంస్కృతులతో భారీ ప్రదర్శన

ఉత్సవాల తొలిరోజు భారతదేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన సంఘాలు సంప్రదాయ దుస్తులు, బ్యానర్లు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ పరేడ్ నిర్వహించనున్నాయి. దోహాలోని పలు పాఠశాలలు, నృత్య సంస్థలకు చెందిన కళాకారులు 15 ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రెండో రోజు కేరళకు చెందిన చెండ మేళం, మహారాష్ట్రకు చెందిన ఢోల్, తమిళనాడుకు చెందిన పరై వాయిద్యాల సమ్మేళనంతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరువాతిర, గర్బా, మోహినియాట్టం, కథక్, కుంమ్మి, కొలాటం వంటి సంప్రదాయ నృత్యాలను పెద్ద సంఖ్యలో కళాకారులు ప్రదర్శించనున్నారు.

100కు పైగా ప్రత్యేక స్టాళ్లు

భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక పెవిలియన్లు ఏర్పాటు చేయనున్నారు. భారతీయ వంటకాలు, హస్తకళలు, సంప్రదాయ దుస్తులు, ఇతర సాంస్కృతిక ఉత్పత్తులతో 100కు పైగా స్టాళ్లు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో 2,000 మందికి పైగా కళాకారులు పాల్గొననుండగా, తెరవెనుక ఏర్పాట్ల కోసం దాదాపు 1,000 మంది పనిచేస్తున్నారని ICC ఉపాధ్యక్షుడు శంతను దేశ్‌పాండే తెలిపారు. ప్రవాస భారతీయ సమాజం నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

భారతీయ గాయనీ అమృత రాజన్, గాయకుడు శ్రేయాస్ పాట్కర్ తమ బృందాలతో సంగీత విభావరి నిర్వహించనున్నారు. గతంలో జరిగిన ఉత్సవాలకు ప్రతిరోజూ 20,000 మందికి పైగా సందర్శకులు హాజరయ్యారని, ఈసారి కూడా భారీ స్పందన లభిస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

ఉచిత ప్రవేశం.. సమయం ఇదే

నవంబర్ 26, 27 తేదీల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వేడుకలు జరుగుతాయి. దోహాలోని ఐడియల్ ఇండియన్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com