దుబాయ్‌లో బరువు తగ్గించే ఉత్పత్తిపై నిషేధం..!!

- November 27, 2026 , by Maagulf
దుబాయ్‌లో బరువు తగ్గించే ఉత్పత్తిపై నిషేధం..!!

దుబాయ్: భద్రతా ప్రమాణాలు, అనుమతి నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో బరువు తగ్గేందుకు ఉపయోగించే 'My Lisaa Weight-Loss' ఉత్పత్తుల విక్రయాలు, దిగుమతి, పంపిణీపై దుబాయ్ ఆరోగ్య శాఖ (DHA) నిషేధం విధించింది. ఈ మేరకు దుబాయ్‌లోని ప్రైవేటు ఆరోగ్య రంగానికి చెందిన ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, ఆరోగ్య నిపుణులకు DHA సర్క్యులర్ జారీ చేసింది. 

ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (EDE) జారీ చేసిన నోటీసును అనుసరించాలని సూచించింది. బరువు తగ్గించే ఉత్పత్తులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు, అధికారిక అనుమతులకు అనుగుణంగా ఉండాలని ఆరోగ్య సంస్థలకు స్పష్టం చేసింది. యూఏఈలో బరువు తగ్గించే మందుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించాలని వైద్యులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, 2026లో యూఏఈలో రోజుకు ఒకసారి నోటి ద్వారా తీసుకునే రెండు GLP-1 బరువు తగ్గించే మందులకు ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనుమతి ఇచ్చింది. అవి ఫౌండాయో (Orforglipron), వెగోవీ పిల్ (Oral Semaglutide). 

వైద్యుల సూచనల ప్రకారం సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పెద్దలకు, లేదా BMI 27 లేదా అంతకంటే ఎక్కువ ఉండి టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, నిద్రలో శ్వాస సమస్యలు వంటి బరువుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మందులను సూచిస్తారు.

అయితే ఈ మందులను వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ కేలరీల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో కలిపి తీసుకోవాలి. కేవలం మందులపైనే ఆధారపడకూడదని సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు కొనసాగించకుండా మందుల వాడకాన్ని ఆపితే తిరిగి బరువు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com