బహ్రెయిన్‌లో ఈ-బైక్‌లతో పిల్లలకు ప్రమాదం..!!
- November 27, 2026
మనామా: ఎలక్ట్రిక్ బైక్‌లు, మోటార్‌సైకిళ్ల వినియోగంలో పిల్లల భద్రతపై బహ్రెయిన్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని రిఫా వ్యూస్ ఓనర్స్ అసోసియేషన్ సూచించింది.
నవంబర్ 17న జారీ చేసిన భద్రతా ప్రకటనలో భాగంగా తమ నివాస సముదాయంలో మైనర్లు ఈ-బైక్‌లు నడుపుతూ పలుమార్లు ప్రమాదకరంగా వ్యవహరించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఇటీవల ఓ కమ్యూనిటీ కార్యక్రమం సందర్భంగా ఓ చిన్నారి నిర్లక్ష్యంగా బైక్ నడపడంతో మరో చిన్నారి కిందపడిన ఘటన జరిగినట్లు తెలిపింది.
ఈ ఘటనతో కార్యక్రమానికి హాజరైన ఇతర పిల్లల భద్రతకు కూడా ముప్పు ఏర్పడిందని అసోసియేషన్ పేర్కొంది. బాధ్యతాయుతంగా వాహనాలు నడపడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని గుర్తుచేసింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలకు సంబంధించి పలువురికి జరిమానాలు విధించడంతో పాటు భద్రతా అధికారులకు కేసులను అప్పగించినట్లు వెల్లడించింది.
తమ నివాస సముదాయ పరిధిలో 16 ఏళ్లలోపు పిల్లలు ఎలక్ట్రిక్ బైక్‌లు, మోటార్‌సైకిళ్లు నడపడం నిషేధమని స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో పిల్లలు ఎక్కువగా ఆటలు ఆడుతూ, బహిరంగ ప్రదేశాల్లో గడుపుతుంటారని, ఇలాంటి చోట్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇతరులకు కూడా ప్రమాదకరంగా మారుతుందని అసోసియేషన్ హెచ్చరించింది. ఈ-బైక్‌లు రవాణాకు, వినోదానికి ఉపయోగపడినప్పటికీ.. బాధ్యతారహితంగా నడిపితే వాహనదారులతో పాటు పాదచారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది.
పిల్లలకు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని, అనుమతించిన వయస్సు రాకముందే వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించింది. నివాస ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు అవగాహన, తల్లిదండ్రుల బాధ్యతాయుత పర్యవేక్షణ, నిబంధనల అమలు తప్పనిసరని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ద్వైపాక్షిక ఆర్థిక సహకారంపై ఒమన్–జపాన్ చర్చలు..!!
- సౌదీలో 77 శాతం మంది ప్రజలకు చేరువలోనే పార్కులు..!!
- బహ్రెయిన్‌లో ఈ-బైక్‌లతో పిల్లలకు ప్రమాదం..!!
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026 ప్రారంభం.. ప్రపంచ స్థాయి యాట్స్ ఆవిష్కరణలతో సందడి
- హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. గల్లంతైన సిబ్బంది మృతి: ADNOC ప్రకటన
- ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న కువైట్.. నలుగురికి గాయాలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!
- ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ ముఠాకు శిక్షలు.. జీవిత ఖైదు..!!
- సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!







