సౌదీలో 77 శాతం మంది ప్రజలకు చేరువలోనే పార్కులు..!!
- November 27, 2026
రియాద్: సౌదీ అరేబియాలో పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో దేశంలోని 77 శాతం మంది నివాసితులకు తమ ఇళ్ల నుంచి 800 మీటర్ల పరిధిలోనే బహిరంగ ప్రదేశాలు, పార్కులు అందుబాటులోకి వచ్చాయని మున్సిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2027 నాటికి 80,000 గృహాలు, అభివృద్ధి చేసిన నివాస స్థలాలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అహ్మద్ అల్ ధాఫిరి తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించేందుకు జెడ్డా, అల్ ఖోబర్, జాజాన్ నగరాల్లో సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నడక, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలకు అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 2026 సెప్టెంబర్ చివరి నాటికి 137 పార్కుల నిర్మాణం పూర్తయిందని, మరిన్ని పార్కులు, పట్టణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా 2025, 2026 సంవత్సరాల్లో కలిపి సుమారు 5.8 మిలియన్ చెట్లను నాటినట్లు వెల్లడించారు. కుటుంబాలకు అందుబాటు ధరల్లో మరిన్ని గృహాలు కల్పించేందుకు స్థానిక, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ డెవలపర్లతో కలిసి పనిచేస్తున్నట్లు అల్ ధాఫిరి పేర్కొన్నారు. 2026లో అత్యంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన 25,000 మందికి పైగా కుటుంబాలకు తగిన నివాస సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనుమతులు లేని 115 చెత్త డంపింగ్ ప్రాంతాలను మూసివేసినట్లు చెప్పారు. మున్సిపల్ వ్యర్థాలు, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్‌లకు తరలించకుండా రీసైక్లింగ్ వైపు మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 2027 నాటికి ప్రధాన రహదారుల నాణ్యత సూచీని 68.8 శాతానికి పెంచడం, ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు, ప్రధాన నగరాల్లో దృశ్య కాలుష్య సూచీని 73కు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మున్సిపల్ అత్యవసర, విపత్తు నిర్వహణ కేంద్రాల సంసిద్ధతను 80 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా రహదారులపై ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం, నగరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం లక్ష్యమని అల్ ధాఫిరి పేర్కొన్నారు. సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని అల్ ధాఫిరి తెలిపారు.
తాజా వార్తలు
- ద్వైపాక్షిక ఆర్థిక సహకారంపై ఒమన్–జపాన్ చర్చలు..!!
- సౌదీలో 77 శాతం మంది ప్రజలకు చేరువలోనే పార్కులు..!!
- బహ్రెయిన్‌లో ఈ-బైక్‌లతో పిల్లలకు ప్రమాదం..!!
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026 ప్రారంభం.. ప్రపంచ స్థాయి యాట్స్ ఆవిష్కరణలతో సందడి
- హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. గల్లంతైన సిబ్బంది మృతి: ADNOC ప్రకటన
- ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న కువైట్.. నలుగురికి గాయాలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!
- ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ ముఠాకు శిక్షలు.. జీవిత ఖైదు..!!
- సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!







