త్వరలో 25 వేల ఉద్యోగాలు..సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

- November 27, 2026 , by Maagulf
త్వరలో 25 వేల ఉద్యోగాలు..సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీపి కబురు అందించారు. త్వరలోనే రాష్ట్రంలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో గురువారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అచ్చంపేట బిడ్డగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రాబోయే రోజుల్లో అదనంగా మరో 25 వేల కొలువులను భర్తీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

కేసీఆర్ పాలన పై నిప్పులు చెరిగిన సీఎం.. బతుకమ్మ చీరలపై విమర్శలు

ఈ సభలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనలో చేసిన తప్పులకు ప్రజలకు సమాధానం చెప్పలేకే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రాన్ని ఏకంగా రూ. 8.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి, చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తెచ్చారని ఆరోపించారు. గతంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు అత్యంత నాసిరకంగా ఉండటంతో ఏ ఒక్క మహిళ కూడా వాటిని కట్టుకోలేదని, అవి కేవలం పొలాల చుట్టూ కంచెగా కట్టుకోవడానికే పనికొచ్చాయని విమర్శించారు. సూరత్ నుంచి కేజీల లెక్కన నాసిరకం చీరలు కొనుగోలు చేసి కమిషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట.. మూడేళ్లలో రూ. 1.78 లక్షల కోట్ల వ్యయం

తమ ప్రజా పాలనలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25.35 లక్షల మంది అన్నదాతలకు రూ. 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేశామని తెలిపారు. గడిచిన మూడేళ్ల కాలంలోనే కేవలం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 1.78 లక్షల కోట్లు ఖర్చు చేసిందని గణాంకాలతో సహా వెల్లడించారు.

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీళ్లందిస్తాం

ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం పదేళ్లపాటు పూర్తిగా నిర్లక్ష్యం చేసి పడావు పెట్టిందని సీఎం ఆరోపించారు. నాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కృష్ణా జలాలను కేసీఆర్ రాసిచ్చారని, ఆనాడు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే నేడు కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని మండిపడ్డారు. పాలమూరు బిడ్డగా ఈ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తానని రేవంత్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com