బహ్రెయిన్‌లో కార్మికులకు వర్క్ వీసా..ఎంపీ కీలక ప్రతిపాదన..!!

- November 27, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో కార్మికులకు వర్క్ వీసా..ఎంపీ కీలక ప్రతిపాదన..!!

మనామా: బహ్రెయిన్‌లో విదేశీ కార్మికులకు వర్క్ వీసాలు జారీ చేయడానికి ముందే వారి యజమానులు తగిన నివాస సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎంపీ జలాల్ కదెమ్ ప్రతిపాదించారు. కార్మికుల నివాస ఒప్పందాలను వర్క్ వీసాలు, గుర్తింపు కార్డులతో అనుసంధానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బహ్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కేవలం 10 నుంచి 15 మంది నివసించేందుకు అనువుగా ఉన్న ఇళ్లలో ఏకంగా 60 మందికి పైగా కార్మికులను ఉంచుతున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. 

కార్మికులకు డబ్బులు ఇచ్చి, వారు స్వయంగా నివాసం వెతుక్కునేలా వదిలేయడం వల్ల ఇళ్లలో రద్దీ మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు నివాసం, ఆరోగ్య బీమా, కనీస మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత యజమానులదేనని జలాల్ కదెమ్ స్పష్టం చేశారు. కార్మికుల గుర్తింపు కార్డుల్లో నమోదైన చిరునామాలు, వారు వాస్తవంగా నివసిస్తున్న ప్రాంతాలు వేర్వేరుగా ఉండటం మరో సమస్యగా మారిందన్నారు. దీనివల్ల అవసరమైనప్పుడు వారి ఆచూకీ గుర్తించడం పోలీసులకు కష్టమవుతోందని పేర్కొన్నారు.

పాత ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పెద్ద సంఖ్యలో కార్మికులను కుక్కుతున్నారని, కొందరు యజమానులు విల్లాలు, నివాస సముదాయాలను అధిక అద్దెలకు తీసుకుని వాటిలో కార్మికులకు వసతి కల్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి రద్దీ నివాసాల్లో అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన ప్రతిపాదనలు విదేశీ కార్మికులకు వ్యతిరేకం కాదని, వారికి గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడంతో పాటు కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో భద్రత, గోప్యతను కాపాడటమే లక్ష్యమని వివరించారు. బహ్రెయిన్‌లోని పలు మున్సిపల్ కౌన్సిళ్లు ఇప్పటికే కార్మికులు, ఒంటరిగా నివసించే వ్యక్తుల కోసం ప్రత్యేక భవనాలు, స్థలాలను కేటాయించే ప్రక్రియ ప్రారంభించాయి. 

అయితే కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో పాత ఇళ్లలో కార్మికులను అధిక సంఖ్యలో ఉంచే సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఎంపీ పేర్కొన్నారు. కార్మికుల నివాసాల పర్యవేక్షణలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), కార్మిక శాఖ, మున్సిపల్ అధికారులు, పరిశ్రమలు-వాణిజ్య మంత్రిత్వ శాఖతో కూడిన సంయుక్త కమిటీ మరింత చురుగ్గా వ్యవహరించాలని కోరారు. చిన్నచిన్న చర్యలతో ఈ సమస్య పరిష్కారం కాదని, కార్మికులకు సురక్షితమైన నివాసాలు కల్పించడంతో పాటు కుటుంబ నివాస ప్రాంతాల స్వరూపాన్ని కాపాడేందుకు స్పష్టమైన చట్టాలు, క్రమబద్ధమైన తనిఖీలు, కఠినమైన అమలు అవసరమని ఎంపీ జలాల్ కదెమ్ అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com