సినిమా రివ్యూ: ‘భొగి’.!

- November 27, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘భొగి’.!

మాస్ డైరెక్టర్‌గా పేరున్న సంపత్ నంది చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రమే ‘భోగి’. శర్వానంద్ హీరోగా నటించగా, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించింది. డింపుల్ హయాతీ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించింది. ప్రచార చిత్రాలు చాలా ఇంటెన్స్‌గా రూపిందించారు. అందుకు తగ్గట్టుగా సినిమా వుందో లేదో తెలియాలంటే ‘భోగి’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
90ల కాలం నాటి కథ ఇది. భొగ్గుల గుట్ట అనే గ్రామంలో పటేల్‌ల ఆధిపత్యం నడుస్తుంటుంది. కనీసం పటేల్ (లోహితాశ్వ) వైపు తల ఎత్తి చూడడానికి కూడా భయపడుతుంటారు ఆ గ్రామస్థులు. అలాంటి ఊళ్లో గంగ అనే కుర్రాడు (శర్వానంద్) తన ఐదుగురు చెల్లెళ్లతో ఆనందంగా జీవనం సాగిస్తుంటాడు. గంగకు చెల్లెళ్లంటే పంచ ప్రాణాలు. మరోవైపు  అప్పుడప్పుడూ ఆ ఊళ్లో అమ్మాయిలు మిస్సవుతుంటారు. అందుకు కారణం ఏంటీ.? ఈ మిస్సింగ్ వ్యవహారంలో పటేల్ హస్తం వుందా.? పంచ ప్రాణాల్లాంటి తన ఐదుగురు చెల్లెళ్లకు ఎలాంటి కష్టం వచ్చింది.? ఆ కష్టాన్ని గంగ ఎలా ఎదుర్కొన్నాడు.? సులోచన (అనుపమ పరమేశ్వరన్) కీ గంగకీ సంబంధం ఏంటీ.? మందారం (డింపుల్ హయాతీ)కి ఈ కథకీ ఎలాంటి సంబంధం.? జనం తలెత్తి చూడడానికే భయపడే ఆ ఊరిలో పటేల్‌ని గంగ ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ‘భోగి’ సినిమా తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
ఎలాంటి పాత్రలోనైనా ఈజీగా ఒదిగిపోగల సత్తా వుంది శర్వానంద్‌కి. ఆ విషయం ఇంకోసారి గంగ పాత్రతో ప్రూవ్  చేసుకున్నాడు. రగ్గ్‌డ్ మాస్ లుక్‌లో బాగా ఒదిగిపోయాడు. రంగస్థలంలో రామ్ చరణ్ పాత్రని తలపిస్తుంది శర్వా పాత్ర ఈ సినిమాలో. అనుపమా పరమేశ్వరన్ డీ గ్లామర్ రోల్‌లో ఆకట్టుకుంటుంది. కానీ, పెద్దగా ప్రాథాన్యత వున్న పాత్ర కాదది. పటేల్ పాత్ర పోషించిన లోహితాశ్వ ఓకే. తన పరిధిలో క్రూరమైన విలనిజం చూపించాడు. డింపుల్ హయాతీ మందారం పాత్ర ఓ సర్‌ప్రైజ్. ఈ పాత్రలో డింపుల్ ఒదిగిపోయిన తీరు చాలా బాగుంది. ఆమె ఆహార్యం, మనసులోంచి తన్నుకొచ్చే భావోద్వేగభరితమైన మాటలు బాగున్నాయ్. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
రొటీన్‌గా ఈ మధ్య చాలా సినిమాల్లో చూసేసిన కథనే ఎంచుకున్నాడు సంపత్ నంది. ఇదో రివేంజ్ డ్రామా. దాదాపు రంగస్థలం తరహా కథనే తలపుకు తీసుకొస్తుంది సగటు ప్రేక్షకుడికి. ‘దేహమే దేవాలయం, ప్రాణమే దేవుడు’ అనే సందేశంతో కథ ముగుస్తుంది. కానీ, అందుకు విరుధ్ధంగా కథ మొత్తం నడుస్తుంటుంది. ఎక్కడిక్కడ తలలు, మొండాలు ఏ కీలుకు ఆ కీలు అంటారుగా.. అలా అవయవాలు తెగి నరకబడతుంటాయ్. మూఢ నమ్మకాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలన్న సందేశం కూడా దాగుంది ఈ సినిమాలో. కథనాన్ని నడిపించే తీరులో సంపత్ నంది ఇంకాస్త కొత్తగా ఆలోచించి వుండాల్సింది. ఎడిటింగ్‌కీ కాస్త ట్రిమ్మింగ్ అవసరమే ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు లోతుగా చెప్పాలనుకుని సాగతీతగా అనిపిస్తాయ్. ఇంటర్వెల్ బ్లాక్ సో సోగానే వుంటుంది. యాక్షన్ అంటే ఆల్రెడీ ఈ మధ్య రెగ్యులర్ ఫార్ములాగా కనిపిస్తున్న రక్తపాతమే. భీమ్స్ అందించిన పాటలు అయితే బాగుంటాయ్. కానీ, అక్కడక్కడా బీజీఎమ్ గోల గోలగా అనిపిస్తుంది. సినిమాకి మాటలు మెయిన్ అస్సెట్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. పాటల చిత్రీకరణలోనే కాదు, బొగ్గుల గుట్ట అనే ఊరులో మనమూ మమేకమైపోయినట్లుగా ఫీల్ క్రియేట్ చేశారు సినిమాటోగ్రఫీతో. నిర్మాణ విలువలు వున్నతంగా వుంటాయ్. ఓవరాల్ టెక్నికల్ టీమ్ వర్క్ గుడ్. 

ప్లస్ పాయింట్స్:
శర్వానంద్ నటన, చిన్నదే అయినా మందారం పాత్ర. సినిమాటోగ్రఫీ, మాటలు..

మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ, ఆకట్టుకోని కథనం, భరించలేని రక్తపాతం, ఎలాంటి ట్విస్టుల్లేని పతాక సన్నివేశాలు..

చివరిగా:
‘భోగి’ ఓ రొటీన్ రివేంజ్ డ్రామా.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com