వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!

- November 27, 2026 , by Maagulf
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!

వాషింగ్టన్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇకపై వినియోగదారులు తమ సందేశాలను ముందుగానే సిద్ధం చేసుకుని, నిర్ణీత సమయానికి ఆటోమేటిక్‌గా పంపించేలా ‘షెడ్యూల్డ్ మెసేజ్’ (Scheduled Messages) ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. రానున్న వారాల్లో ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా వ్యక్తిగత చాట్స్‌తో పాటు గ్రూప్ చాట్స్‌లోనూ మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సందేశాలతో పాటు ఫొటోలు, వీడియోలను కూడా ముందుగానే షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. కనీసం 10 నిమిషాల నుంచి గరిష్ఠంగా 14 రోజుల ముందుగానే సందేశాలను పంపేందుకు సమయాన్ని నిర్ణయించుకోవచ్చు.

అంతేకాకుండా, షెడ్యూల్ చేసిన సందేశాలను పంపించే సమయానికి ముందే పరిశీలించడంతో పాటు అవసరమైతే తొలగించుకునే సదుపాయం కూడా ఉంటుంది. అయితే, సందేశం అందుకున్న వారికి అది ముందుగా షెడ్యూల్ చేసిన మెసేజ్ అనే విషయం తెలియదు. సాధారణ సందేశంగానే కనిపిస్తుంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు పంపించే సమయంలో వినియోగదారుల ఫోన్ ఆన్‌లో ఉండాల్సిన అవసరం లేదని మెటా వెల్లడించింది. ఈ సందేశాలకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత కొనసాగుతుందని తెలిపింది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు ఈ ఫీచర్‌ను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఈ సదుపాయం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై వాట్సాప్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com