యూఏఈ జాతీయ దినోత్సవం.. వాహనదారులకు శుభవార్త..!!
- November 28, 2026
అబుదాబి: యూఏఈ 55వ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఎతిహాద్) సందర్భంగా వాహనదారులకు అబుదాబి పోలీసులు ప్రత్యేక అవకాశం కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడిపే వారికి వారి డ్రైవింగ్ లైసెన్స్ ఖాతాలో ఉన్న 4 బ్లాక్ పాయింట్లను తగ్గించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
అబుదాబి పోలీస్ ప్రారంభించిన 'సెలబ్రేట్ సేఫ్లీ' (Celebrate Safely) కార్యక్రమంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం వాహనదారులు ముందుగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేయాలి. అనంతరం 2026 డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా, ప్రమాదాలకు కారణం కాకుండా ఉండాలి. వాహనాల అలంకరణకు సంబంధించిన నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాలి.ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు అబుదాబి పోలీస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వాహనదారులు పాటించాల్సిన నిబంధనలు
* డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు.
* అనుమతి లేని ర్యాలీలు, వాహనాల ఊరేగింపులు నిర్వహించకూడదు.
* రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదు.
* డ్రైవింగ్ చేస్తూ లేదా ప్రయాణికులుగా ఉన్నప్పుడు పార్టీ స్ప్రే క్యాన్లు ఉపయోగించకూడదు.
* ప్రయాణికులు కారు కిటికీలు, సన్‌రూఫ్‌ల నుంచి బయటకు వేలాడకూడదు.
* రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేయవద్దు.
* పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
వాహనాల అలంకరణలోనూ జాగ్రత్తలు
జాతీయ దినోత్సవం సందర్భంగా వాహనాలను అలంకరించుకునే వారు కొన్ని నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
* ముందు, పక్క కిటికీలకు స్టిక్కర్లు అంటించకూడదు.
* అధిక శబ్దం వచ్చే అలంకరణ వస్తువులు అమర్చకూడదు.
* వాహనం బాడీ లేదా ఇంజిన్‌లో అనుమతి లేని మార్పులు చేయకూడదు.
* డ్రైవర్‌కు ఎదురుగా రహదారి కనిపించకుండా చేసే అలంకరణలు ఉండకూడదు.
* ఈద్ అల్ ఎతిహాద్‌కు సంబంధం లేని స్కార్ఫ్‌లను ఉపయోగించకూడదు.
* వాహన నంబర్ ప్లేట్లను కప్పకూడదు.
* వాహనం రంగును మార్చకూడదు.
* ముందు విండ్‌షీల్డ్‌కు డార్క్ టింట్ వేయకూడదు.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం
అబుదాబి పోలీస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మంచి స్పందన లభించిందని తెలిపింది. జాతీయ వేడుకల సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనదారులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. వాహనదారులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని ట్రాఫిక్ ప్రతిజ్ఞ చేయాలని పోలీసులు సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంతో పాటు జాతీయ వేడుకలను సురక్షితంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీపై దాడులను ఖండించిన పలు దేశాలు..!!
- యూఏఈ జాతీయ దినోత్సవం.. వాహనదారులకు శుభవార్త..!!
- విమానంలో సాంకేతిక లోపం.. మస్కట్‌కు మళ్లింపు..!!
- ఒమన్‌లో ‘గల్ఫ్ ఆట’ ఆవిర్భావం..ప్రవాస భారతీయుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!
- సౌదీపై హౌతీల దాడి..నేపాల్ కార్మికుడు మృతి, పలువురికి గాయాలు..!!
- ఖతార్‌లో ఊపందుకుంటున్న సినీ పరిశ్రమ..!!
- యూఏఈలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు..!!
- ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ట్రక్కులు, మరో వాహనం దగ్ధం..!!
- కువైట్‌లో అల్ రాయ్ పక్షుల మార్కెట్ శాశ్వతంగా మూసివేత..!!







