షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- November 28, 2026
షార్జా: యూఏఈలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరో వ్యక్తికి డ్రగ్స్ వినియోగించిన నేరంపై మూడు నెలల జైలు శిక్ష విధించింది. అయితే డ్రగ్స్ విక్రయించాలనే ఉద్దేశం నిరూపితం కాకపోవడంతో రెండో వ్యక్తిపై ఉన్న అక్రమ రవాణా అభియోగాల నుంచి కోర్టు విముక్తి కల్పించింది. ఈ కేసు విచారణ జనవరి 2024లో ప్రారంభమైంది.
ఓ వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు షార్జా యాంటీ నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకున్న పోలీసులు ఓ దుకాణం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగులో పసుపు రంగు ప్యాకెట్లో ఒక కిలోకు పైగా హషీష్ లభించింది. అనంతరం నిందితుడి ఇంట్లో తనిఖీలు చేయగా క్రిస్టలైన్ పదార్థం,మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉన్న పరికరాలు లభించాయి. ఫోరెన్సిక్ పరీక్షల్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో గంజాయి సంబంధిత పదార్థాలు, మెథాంఫెటమైన్ ఉన్నట్లు గుర్తించారు.
560 గ్రాముల హషీష్‌తో మరో వ్యక్తి అరెస్ట్
నిందితుడు పోలీసుల అదుపులో ఉన్న సమయంలో ఆసియా దేశం నుంచి అతడికి ఫోన్ వచ్చింది. అల్ నహ్దా ప్రాంతంలో డ్రగ్స్ ప్యాకెట్‌ను ఓ చోట ఉంచాలని, అక్కడి నుంచి మరో వ్యక్తి తీసుకెళ్తాడని ఫోన్ చేసిన వ్యక్తి సూచించాడు. దీంతో పోలీసులు దాదాపు 560 గ్రాముల హషీష్ ఉన్న ప్యాకెట్‌ను నిర్ణీత ప్రాంతంలో ఉంచి నిఘా పెట్టారు. తెల్లవారుజామున ఓ వాహనంలో వచ్చిన రెండో వ్యక్తి ఆ ప్యాకెట్‌ను తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. వైద్య పరీక్షల్లో ఇద్దరూ మెథాంఫెటమైన్ వినియోగించినట్లు వెల్లడైంది.
రెండో వ్యక్తికి మూడు నెలల జైలు
ప్రాథమిక విచారణలో మొదటి వ్యక్తికి డ్రగ్స్ అక్రమ రవాణా ఉద్దేశంతో కలిగి ఉన్న నేరంపై జీవిత ఖైదు విధించారు. రెండో వ్యక్తికి డ్రగ్స్ వినియోగించినందుకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ, అక్రమ రవాణా అభియోగాల నుంచి విముక్తి కల్పించారు. రెండో వ్యక్తిని అక్రమ రవాణా ఆరోపణల నుంచి విముక్తి చేయడాన్ని ప్రాసిక్యూషన్ అప్పీల్ చేసింది. విచారణ సందర్భంగా ఓ పోలీసు అధికారి ఇచ్చిన వాంగ్మూలంలో, హషీష్‌ను చిన్న భాగాలుగా విభజించి విక్రయించాలని రెండో వ్యక్తి భావించినట్లు తెలిపాడు.
అయితే వీడియో లింక్ ద్వారా న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన రెండో నిందితుడు డ్రగ్స్ వినియోగించినట్లు అంగీకరించినప్పటికీ, విక్రయించే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. దీనిపై విచారణ జరిపిన అబుదాబీ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు అధికారి వాంగ్మూలం ఒక్కటే డ్రగ్స్ విక్రయించాలనే ఉద్దేశాన్ని నిరూపించడానికి సరిపోదని పేర్కొంది. దీంతో రెండో వ్యక్తిపై అక్రమ రవాణా అభియోగాల నుంచి విముక్తిని సమర్థిస్తూ, డ్రగ్స్ వినియోగానికి విధించిన మూడు నెలల జైలు శిక్షను యథాతథంగా ఉంచింది.
తాజా వార్తలు
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి
- పేద మహిళలను అక్రమంగా గల్ఫ్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు..భారత్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్
- కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..
- కువైట్‌లో మాదకద్రవ్యాల కేసులో రాజకుటుంబ సభ్యుడి అరెస్ట్..
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్
- బహ్రెయిన్‌లో సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం విస్తరణ..!!







