మదర్ థెరిసాకు 'సెయింట్' హోదా
- September 04, 2016
మానవతా మూర్తి మదర్ థెరిసాకు 'సెయింట్' హోదా ప్రకటించారు. ఆదివారం వాటికన్ నగరంలో మతగురువుల జాబితాలో చేర్చే ఉత్సవంలో పోప్ ఫ్రాన్సిస్ థెరిసాకు సెయింట్(పవిత్ర) హోదా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది థెరిసా అభిమానులు తరలివచ్చారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం హాజరైంది. మదర్ థెరిసా స్థాపించిన 'మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' సుపీరియల్ జనరల్ సిస్టర్ మేరీ ప్రేమ ఆధ్వర్యంలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 40 మందికి పైగా నన్స్ కూడా పాల్గొన్నారు.
కోల్‌కతా వీధుల్లో 45 సంవత్సరాల పాటు పేదలు, రోగుల సేవలో నిమగ్నమైన మదర్ థెరిసాకు సెయింట్ హోదా ఇవ్వనున్నట్లు మార్చి నెలలో పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ఈ ప్రక్రియ కోసం కనీసం రెండు మహిమలు చోటుచేసుకోవాల్సి ఉండగా.. ఆ రెండు ఘటనల్నీ గుర్తించారు. 2002లో వాటికన్ అధికారికంగా తొలి మహిమను గుర్తించింది. కడుపులో కణతిలో బాధపడిన మోనికా బెర్సా అనే బెంగాలీ గిరిజన మహిళకు 1998లో నయమైన ఘటనను గుర్తించింది. రెండో మహిమ బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. థెరిసా ప్రార్థనల ఫలితంగా ఓ వ్యక్తి అద్భుతరీతిలో కోలుకున్నట్లు గుర్తించారు.
జననం: 1910, ఆగస్టు 26, మాసిడోనియా స్కోప్జేలో జన్మించారు. పేరు..ఆగ్నెస్ గోన్‌క్సా బోజాక్సియు.
మరణం: 1997, సెప్టెంబరు 5. కోల్‌కతాలో
జన్మదినం: బాప్టిజం స్వీకరించిన ఆగస్టు 27.
కుటుంబం: అల్బేనియా తల్లిదండ్రులకు మూడో సంతానం. తండ్రి నికొలా బొజాక్సియు, తల్లి డ్రేన్. ఆమెకు ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి మరణించారు.
కుటుంబ సభ్యులు: అక్క అగా, అన్న లాజర్.
మతప్రస్థానం: ఐర్లాండ్‌లోని సిస్టర్స్ ఆఫ్ లోరెటో అనే క్యాథలిక్ వ్యవస్థలో చేరేందుకు 18 ఏళ్ల వయసులో ఇంటిని వదిలి వెళ్లారు. 1929లో భారత్‌కు వచ్చారు. పేరు థెరిసాగా మారింది.
ఉపాధ్యాయురాలు: 1931 నుంచి 1948 వరకు కోల్‌కతాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో సిస్టర్ థెరిసా బోధన సేవలందించారు.
మలుపు: 1946, సెప్టెంబరు 10న 'దైవపిలుపు'ను అందుకొని కోల్‌కతా మురికివాడలకు చేరారు. అక్కడి ప్రజలు ఆమెను పూజ్యభావంతో 'మదర్' థెరిసాగా పిలుచుకున్నారు.
కొత్త వ్యవస్థ: 1950, అక్టోబరు 7న 'మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' ఏర్పాటుకు క్యాథలిక్ చర్చి అనుమతి పొందారు.
గుర్తింపు: 1979లో నోబెల్ శాంతి బహుమతి. 1980లో భారతరత్న. 1971లో 23వ పోప్‌జాన్ శాంతి బహుమతి. 1969లో నెహ్రూ పురస్కారం. 1978లో బల్జాన్ పురస్కారం. 1973లో టెంపుల్టన్ పురస్కారం. 1962లో మెగ్సెసే అవార్డు.
కీలకఘట్టం: సెయింట్ హోదా పొందేందుకు ముందస్తు అడుగైన 'బీటిఫికేషన్' ప్రక్రియను 2003లో రెండో పోప్ జాన్‌పాల్ పూర్తిచేశారు.
తుదిఘట్టం: 2016, సెప్టెంబరు 4న మదర్ థెరిసాకు క్యాథలిక్ చర్చి పునీత హోదా ప్రకటన.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







