నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

- September 04, 2016 , by Maagulf
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

గురు బ్రహ్మ ! గురు విష్ణు !! గురు దేవో మహేశ్వరః !!! గురు సాక్షాత్ పరబ్రహ్మ ! తస్మైత్ శ్రీ గురవేన్నమః !!! ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువులను స్మరిస్తూ

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి 
ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి 
జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు 
సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు 
అతడు ...ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు ! 

మనకు జన్మనిచ్చిన తల్లి దండ్రుల తర్వాత మనం గౌరవించేది.... మనల్ని గౌరవించేది.... మన మంచిని కోరేది..... కల్మషం లేని మనసుతో మనల్ని దీవించేది ఎవరైనా ఉన్నారంటే వారు గురువులే.. అందుకే మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్5 ఉపాద్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ గురువులను పూజిస్తున్నాం.. వారి సేవలను గుర్తుచేసుకుంటున్నాం. అయితే ఎందుకు అదే రోజు ఉపాద్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్‌ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు టీచర్స్‌ డేగా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. అయితే సర్వేపల్లి రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన తన మాత్రం ఉపాధ్యాయుడిగానే తన జీవితాన్ని మొదలు పెట్టాడు. ఆ వృత్తితోనే గొప్ప పదవులను సాధించాడు. కాని ఏ రోజు తనకు ఆ పదవి, ఈ పదవి కాదు నాకు ఉపాద్యాయ వృత్తిలోనే సంతృప్తి చెందాను అని తెలిపారు. 
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్ధి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్ధి సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com