హైదరాబాదులో సీమాంధ్రుల ఫిలిం స్టూడియోలు....
- September 10, 2016
హైదరాబాదులో తొలినాటి సినిమా ఆనవాళ్లు ఎక్కడున్నాయో తెలుసుకునే క్రమంలో లభించిన ప్రతీ సమాచారమూ అత్యంత విలువైందే. 1896లోనే హైదరాబాదుకు సినిమా పరిచయం అయింది. అంటే బొంబాయికి సమాంతరంగా ఇక్కడ సినిమా చరిత్ర పరఢవిల్లిందనేది స్పష్టం. 1920 నాటికి ఇక్కడ సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. 1922 కల్లా మూకీల నిర్మాణమూ మొదలైంది. ఈ క్రమంలో హైదరాబాదులో సినిమా స్టూడియోల విషయానికి వస్తే వాటికి కూడా 1922లోనే బీజాలుపడ్డాయని చెప్పేందుకు తగిన ఆధారాలున్నాయి.
ధీరేన్ గంగూలీతో మొదలు: 1913లో దాదాసాహెబ్ ఫాల్కే తొలి భారతీయ కథాచిత్రం రాజా హరిశ్చంద్ర తీశాక దేశమంతా సినిమాల వైపు దృష్టి మళ్లించింది. అప్పటికి చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ప్రాంతాలు కూడా సినిమాలు తీయాలని భావించాయి.
నాటి హైదరాబాదు రాజ్యం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అప్పటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కోల్‌కతా నుండి ధీరేన్ గంగూలీని పిలిపించి మూకీలు తీయించారు. ఈ ప్రయత్నమే హైదరాబాదులో సినిమా స్టూడియోలకు బీజం వేసింది.
నిజాం చొరవ: కోల్‌కతా నుండి ధీరేన్ గంగూలీ హైదరాబాదుకు రాగానే చేసిన మొదటి పనేమిటంటే తాను తీయబోయే సినిమాల చిత్రీకరణకు కావలసిన స్టూడియో ఏర్పాటు. ఆ తరువాత తీసిన సినిమాల ప్రదర్శనకు థియేటర్ల నిర్మాణం. ఈ రెండు కూడా సమాంతరంగా నిర్మాణం జరుపుకున్నాయి. ఆబిడ్స్‌లోని గన్‌ఫౌండ్రీలో లోటస్ ఫిలిం కంపెనీ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు ధీరేన్. స్టూడియోలో ఒక ఫ్లోర్‌తోపాటు లాబ్ వంటి వసతులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్టూడియోలోనే ధీరేన్ చింతామణి, ఇంద్రజిత్, మెరేజ్ టానిక్, ది లేడీ టీచర్ (1922), యయాతి, హరగౌరి(1923) అనే ఆరు మూకీలు తీశారు. ధీరేన్ ప్రతిభను చూసిన నిజాం ఆయనకు హైదరాబాదులో సినిమాల నిర్మాణానికి కావలసిన అన్ని వసతులనూ కల్పించారు. ఆయన షూటింగ్‌లు జరుపుకోవడానికి హైదరాబాదులో ఉద్యానవనాలను, తమ భవంతులను వాడుకునేందుకు కూడా అనుమతులిచ్చారు.
మరొక సమాచారం ఏమిటంటే మూకీల కాలంలో ఇక్కడి స్థానికులు సినిమాలు తీయాలని సంకల్పించడం. జిమోతీలాల్ థియేటర్స్ లిమిటెడ్ కంపెనీ, 1930లో దక్కన్ టాకీస్ లిమిటెడ్ 1936లో లక్ష రూపాయల చొప్పున పెట్టుబడితో మొదలయ్యాయి. ఇంకా మహావీర్ ఫొటోప్లేస్ నేషనల్ ఫిలిం కంపెనీ (21.06.1930), ఫిలిం కార్పొరేషన్ లిమిటెడ్ (1930), జహంగీర్ పిక్చర్స్ లిమిటెడ్ కంపెనీ (1930) కూడా మొదలయ్యాయి. కానీ వీటిలో ఒక్క మహావీర్ సంస్థ మాత్రమే మూకీలు తీసింది. మిగతా నాలుగూ ఏడాది తిరగకుముందే మూతపడ్డాయి. కారణమేమిటంటే ముందుగా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చు కొనకపోవడమే అనిపిస్తోంది. ఆ తరువాత హైదరాబాదులో మరిన్ని థియేటర్లు నిర్మాణం జరుపుకున్నాయి గానీ మరో సినీ స్టూడియో మాత్రం ఏర్పాటు కాలేదు.
నలభయ్యవ దశకం: 1931లో టాకీలు వచ్చినప్పటికీ 1946లో హైదరాబాదులో తొలి టాకీ స్టూడియో నెలకొంది. అదే మహబీర్‌సింగ్ స్టూడియో. మహావీర్‌సింగ్ ముంబై చిత్ర పరిశ్రమలో సినిమా రంగంపై కొంత అనుభవం గడించి హైదరాబాదు ఫిలిం స్టూడియో పేరుతో అంబర్‌పేటలో ఒక స్టూడియోను నిర్మించారు. ఇబ్రత్ హిందీ చిత్రాన్ని ఈ స్టూడియోలో నిర్మించి విడుదల చేసినట్లు 1968 జయశ్రీ సంక్రాంతి సంచికలో రాశారు. 1963లో మళ్లీ దీన్ని ప్రారంభించాలనే సన్నాహాలు జరిపినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఈ మహావీర్ సింగ్ అప్పుడు హైదరాబాదులో మీజాన్ తెలుగు పత్రిక సంపాదకులైన అడివి బాపిరాజును తమ స్టూడియో నిర్వహణలో, సినిమా నిర్మాణంలో తోడుగా జత కలుపుకున్నారు. అప్పటికే ఆయన మద్రాసులో మీరాబాయి వంటి సినిమాలు తీసి వున్నారు. బాపిరాజుతో తెలుగు సినిమానొకదాన్ని నిర్మించతలపెట్టి ముంబై నుంచి సామగ్రిని తెప్పించి ఫిల్మ్ స్టూడియో నిర్మాణం ప్రారంభించారు. కానీ 1948లో హైదరాబాదు స్టేట్‌లో రజాకార్ల దురంతాలు, తెలంగాణ విమోచన ఉద్యమాల మధ్య ఆ ప్రయత్నాలేవీ ముందుకు సాగలేదు. ఏమైనా, ప్రస్తుతం పెద్ద గోడౌన్‌లా ఆనాటి స్టూడియో ఆనవాళ్లు నేటికీ కనిపించడం విశేషం. ఈ స్టూడియో తరువాత గోడౌన్‌గా మారిపోయినా దీని ఆనవాళ్లు వడ్డెరబస్తీలో ఇప్పటికీ కనిపిస్తాయి. 1950ల తొలినాళ్లలో ఈ స్టూడియోను హిందీలో హైదరాబాదీ హీరో అజిత్ కొనడానికి ప్రయత్నాలు చేసినా, 1963లో దీనిని పున:ప్రారంభించాలని ప్రయత్నాలు చేసినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం అశ్విన్‌జీ సోదరుల యాజమాన్యంలో ఈ స్టూడియో ఉంది.
ఆహ్వానం ఇలా: 1956లో ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్‌లు ఒక్కటై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటి వరకు మద్రాసులో స్థిరపడిన తెలుగు సినిమా పరిశ్రమ దృష్టి హైదరాబాదు వైపు మళ్లింది. దీనికి బీజం 1955లో పడింది. ఈ ఏడాదిలోనే సారధీవారి రోజులు మారాయి సినిమా సికిందరాబాదులోని రాజేశ్వరి థియేటర్‌లో నూరు రోజులు ఆడింది. అక్కడే శతదినోత్సవ సంబురాలు జరిగాయి. ఈ సంబురానికి నాటి హైదరాబాదు స్టేట్ ప్రభుత్వంలోని రెవెన్యూ మంత్రి కె.వి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా వచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన హైదరాబాదులో తెలుగు సినిమాలు నిర్మించడానికి సినీ ప్రముఖులను ఆహ్వానించారు. ఆ తరువాత చల్లపల్లి రాజా, ఎస్.ఆర్. వై. రామకృష్ణ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1956లోనే సారథీ స్టూడియో నిర్మాణం ప్రారంభించి 1958లో పూర్తి చేశారు. పదకొండున్నర ఎకరాల స్థలంలో నాలుగు ఫ్లోర్లు, రెండు యూనిట్లు, లాబోరేటరీ, రికార్డింగ్ కమ్ ప్రొజెక్షన్ థియేటరు వసతులతో తయారైంది. రోజుకు 40 రీళ్లు ప్రింటు చేయగల సామర్థ్యం లాబోరేటరీలో ఉండేది.
సారథి స్టూడియో: సారథి స్టూడియోస్ 1958 జూన్ 6న ప్రారంభం కాగా పి.గంగాధరరావు నిర్మించిన మా యింటి మహాలక్ష్మి తొలిసారిగా ఈ స్టూడియోలో నిర్మాణం జరుపుకుంది. ఇదిలా ఉంటే ఆ తర్వాత సారథి స్టూడియోలో వారివే భాగ్యదేవత (1959), కుంకుమరేఖ, కులదైవం (1960), కలిసి ఉంటే కలదు సుఖం (1961), ఆత్మబంధువు (1962) వంటి తెలుగు, తమిళ చిత్రాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. కానీ బయటి నిర్మాతల నుండి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో స్టూడియోని మూసి వేయాల్సి వచ్చింది. ఇంతలో మద్రాసులో 1962లో వాహినీ స్టూడియోలో సమ్మె జరగడంతో తెలుగు నిర్మాతల దృష్టి హైదరాబాదు వైపు మళ్లింది. సారథి స్టూడియోను నవయుగ శ్రీనివాసరావు లీజుకు తీసుకున్నారు. ఆ తరువాత అన్నపూర్ణా వారు తీయబోయే చదువుకున్న అమ్మాయిలు (1963) సినిమాను ఇక్కడే సారథిలో తీయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అక్కినేని హైదరాబాదుకు నివాసం మార్చి ఉన్నారు. సారధిలో నటీనటులకు గదులుండటం వల్ల చాలామంది షూటింగ్‌కు సుముఖత వ్యక్తం చేశారు. అది మొదలు పి.ఏ.పి., జగపతి, పద్మశ్రీ (పి.పుల్లయ్య), బాబూ మూవీస్ వంటి ప్రసిద్ధ సంస్థలు హైదరాబాదులో సారధిలోనే షూటింగులు చేయనారంభించాయి. ఇంతలో భాగ్యనగర స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణా, హీరో కృష్ణ పద్మాలయా స్టూడియోలు రావడంతో సారథికి పని తగ్గినా హైదరాబాదుకు మాత్రం షూటింగుల కళ వచ్చింది. 1990 నాటికి హైదరాబాదులో ఆరు స్టూడియోలు, డబ్బింగు, రీరికార్డింగ్ థియేటర్లు నాలుగు, ఒక నలుపు తెలుపు, రెండు కలర్ లాబోరేటరీలు, తొమ్మిది ఎడిటింగ్, 13 ఔట్‌డోర్ యూనిట్లు ఉన్నాయి.
ఇక్కడి స్థలాలు: అక్కినేని నాగేశ్వర్‌రావు తన పరపతితో అప్పటి ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిల కాలంలో ప్రభుత్వంతో రాయితీలు పొంది తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదు రావడానికే కొంత కారణమైనారు. ఎల్.వి.ప్రసాద్, అక్కినేని స్టూడియోల కోసం దరఖాస్తులు చేసుకుంటే అన్నపూర్ణ స్టూడియోకు బంజారాహిల్స్‌లో స్థలం కేటాయించగా, ఎల్.వి.ప్రసాద్‌కు చాలా ఏండ్ల తరువాత చంద్రబాబు కాలంలో నేటి నెక్లెస్ రోడ్ సర్కిల్‌లో నిజాం నాటి విద్యుత్ కేంద్రాన్ని ధ్వంసం చేసి ప్రసాద్ ఐమాక్స్‌కు జాగా ఇచ్చారు.
1960 నాటికి హైదరాబాద్ పాతబస్తీలోని జహనూమాలో సదరన్ మూవీటోన్ స్టూడియో ఒకటి ఏర్పాటైంది. అదే ఆ తరువాత అజంతా స్టూడియో అయ్యింది. ఇందులో తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. లవకుశ నిర్మాత శంకర్‌రెడ్డి భారీగా తీసిన రహస్యం ఇక్కడే తయారైంది. జి.రామకృష్ణారెడ్డి సోదరులు ఈ స్టూడియో నిర్వాహకులు.
అక్కినేని, కృష్ణలు: నాగేశ్వరరావు బంజారాహిల్స్‌లో అన్నపూర్ణ స్టూడియోను 1976 జనవరి 14న ప్రారంభించారు. ఎన్.టి.రామారావు 1976 జూన్ 7న ముషీరాబాద్‌లో రెండు ఫ్లోర్లతో రామకృష్ణా స్టూడియోను నెలకొల్పి తొలుత దానవీర శూరకర్ణ సినిమాతో షూటింగులు ప్రారంభించారు. 1989లో ఇక్కడి ఫ్లోర్లను నాచారం తరలించారు. ఇంతలో 1983లో హీరో కృష్ణ పద్మాలయా స్టూడియోస్ కట్టారు. ఇందులో ఆయన సొంత చిత్రాలే గాక హిందీ, తెలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. దీనికన్నా ముందు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాదం రామస్వామి 1964లో బంజారాహిల్స్ రోడ్ నెం.14లో కొన్న స్థలంలో 1976లో భాగ్యనగర్ స్టూడియోస్ నిర్మించారు. 1977 అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ స్టూడియోలో బయటి చిత్రాలు చిత్రీకరణ జరుపుకోవడమే గాక బాదం రామస్వామి స్వంతంగా చెప్పింది చేస్తా (1978) సినిమా తీశారు కూడా. కానీ ఎంతో కాలం ఈ స్టూడియో నడవలేదు. ప్రస్తుతం స్టూడియో పరిసరాల్లో స్కూలు, నివాస గృహాలుండగా స్టూడియోను హూండాయ్ కంపెనీకి లీజుకు ఇచ్చేశారు. 1970ల్లో సైదాబాద్‌లో శ్రీనివాస స్టూడియో ఒకటి ఏర్పాటైంది. ఇక్కడ కొద్దికాలం పాటు తెలుగు, హిందీ సినిమాల షూటింగ్స్ జరుపుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
రామోజీ స్టూడియో: ఎన్‌టీ రామారావు 1983లో ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాదులో సినిమా రంగం వేళ్లూనుకుంటుందని చాలా మంది ఆశించారు. కానీ ఆయన రాజకీయాలు, పరిపాలన, మద్రాసుకు నీళ్లందించే విషయాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. వీటి సంగతి అలా ఉండగా, ఈయన కాలంలోనే అన్నపూర్ణా స్టూడియోస్‌లో కొంత భాగాన్ని నిబంధనల మేరకు తిరిగి తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఆ తరువాత 1989లో డి. రామానాయుడు జుబ్లీహిల్స్‌లోని రాతిగుట్టల్ని చదును చేసి ప్రభుత్వ స్థలంలో రామానాయుడు స్టూడియోను ప్రారంభించారు. అన్నిరకాల వసతులు ఇందులో ఏర్పరిచారాయన. స్క్రిప్టుతో వచ్చి తొలి కాపీతో బయటికి వెళ్లవచ్చని రామానాయుడు అప్పట్లోనే చెప్పేవారు. ఇంకా ఈయనే నానక్‌రామ్ గూడాలో పెద్ద బిల్డింగ్ సెట్‌తో షూటింగ్‌కు వసతులు ఏర్పరిచారు. వీటి మధ్యన కె.ఎస్.రామారావు కూడా ఒక స్టూడియోను ఏర్పాటు చేసినా అది ఎంతో కాలం కొనసాగ లేదు. వీటన్నింటి తరువాత రామోజీరావు ప్రపంచస్థాయిలో చెప్పుకోదగిన విధంగా 1996లో మొదలుపెట్టి అనాస్‌పూర్ (హిమాయత్‌నగర్ మండలం)లో తన పేరనే రామోజీ ఫిలిం సిటీని వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అత్యాధునిక హంగులు, భారీ నిర్మాణాలు, సాంకేతిక విభాగాలు ఒకటేమిటి అన్ని వసతులతో ఈ స్టూడియోను నిర్మించారు. కానీ చిన్న, మధ్యతరగతి నిర్మాతలకు మాత్రం ఇక్కడ చిత్రీకరణ జరుపుకునేందుకు ఈ ఫిలిం సిటీ అందుబాటులో లేదంటారు. భారీ, అతి భారీ, హిందీ చిత్రాల వారికే ఇక్కడ షూటింగ్ సాధ్యమని సినిమా వర్గాల వారు చెబుతారు. మరోవైపు పర్యాటక కేంద్రంగా పెద్ద వ్యాపారమే నడుస్తోందక్కడ.
స్డూడియోలే చెబుతాయి!
తెలంగాణలో తెలుగు సినిమా ఉంది. కానీ తెలుగు సినిమాలో తెలంగాణ లేదు అన్న విషయం హైదరాబాదులోని స్టూడియోల గురించి తెలుసుకుంటే తేలిపోతుంది.
హైదరాబాదులో సినిమా స్టూడియోలు నెలకొన్నాయి, నిజమే. ప్రోత్సాహాల కింద ప్రభుత్వం నుండి వీరిలో చాలామంది భూములు పొందారు. కానీ, ఈ ప్రాంతం భూముల్లో సినిమాలు స్టూడియోలు కట్టి తెలంగాణ వారికి ఎంతమందికి అవకాశాలు కల్పించారనే ప్రశ్న వేసుకుంటే ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది ఉండరు. సెక్యురిటీ గార్డులు, డ్రైవర్లు, ఆఫీస్‌బాయ్‌లు, లైట్‌బాయ్‌లుగానే తెలంగాణ వారు ఎక్కువగా కనిపిస్తారు. వీళ్లిక్కడ కట్టిన స్టూడియోలు వ్యాపారానికి, వారి పిల్లల సినీ కెరీర్‌కు ఉపయోగపడ్డాయి తప్ప స్థానికులకు ఒరిగిందేమీ లేదు. కాకపోతే తెలుగు సినిమా మద్రాసు నుండి నాటి తెలుగు రాజధాని హైదరాబాదుకు వచ్చింది. కానీ అందులో తెలంగాణకు స్థానం లేదంటే అతిశయం లేదు. బాదం రామస్వామి వంటి వారు ముందుకు వచ్చి స్టూడియో కడితే దాన్ని ముందు పడనీయరు. ఇప్పుడు హైదరాబాదులో మిగిలినవన్నీ మనవి కాని సీమాంధ్రుల యాజమాన్యంలో ఉన్న ఫిలిం స్టూడియోలే.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







