రివ్యూ: నిర్మలా కాన్వెంట్
- September 15, 2016
సినిమా పేరు: నిర్మలా కాన్వెంట్
నటీనటులు: నాగార్జున.. రోషన్.. శ్రియా శర్మ.. ఎల్బీ శ్రీరామ్.. సూర్య.. అనితా చౌదరి.. ఆదిత్య మేనన్ తదితరులు.
సంగీతం: రోషన్ సాలూరి
ఛాయాగ్రహణం: ఎస్వీ. విశ్వేశ్వర్
నిర్మాతలు: నాగార్జున..
నిమ్మగడ్డ ప్రసాద్
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
సంస్థ: అన్నపూర్ణ స్డూడియోస్, మాట్రిక్స్ వర్క్స్
విడుదల: 16-09-2016
నాగార్జున నిర్మాతగా ఓ సినిమా వస్తోందంటే కచ్చితంగా దానిపై ఆసక్తి పెరుగుతుంది. శ్రీకాంత్ తనయుడు కథానాయకుడిగా మారడం.. నాగార్జున ఓ కీలకపాత్ర పోషించడం ఇవన్నీ.. అదనపు హంగులయ్యాయి. 'నిర్మలా కాన్వెంట్' అనే ఆసక్తికరమైన టైటిల్ దానికి తోడైంది. ఈ మధ్య ప్రేమ కథలు విజయవంతమై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో 'నిర్మలా...' పై దృష్టి మళ్లింది. మరీ.. సినిమా ఎలా ఉంది? కొత్తతరం చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకొనే రీతిలో సాగిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే: శామ్యుల్ (రోషన్) చురుకైన కుర్రాడు. నిర్మలా కాన్వెంట్ స్టూడెంట్. చదువులో ఫస్ట్. ఎప్పుడూ పుస్తకాలే లోకం. ప్రతీ విషయాన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడం అతనికి అలవాటు. అదే కాన్వెంట్‌లో శామ్యూల్‌తో పాటు చదువుతుంటుంది శాంతి (శ్రియ శర్మ). ఆ కాన్వెంట్‌లో అబ్బాయిలంతా శాంతి వైపు పడుతుంటే... తను మాత్రం శామ్యూల్‌ని ఇష్టపడుతుంది. అతన్ని కవ్విస్తుంది. శామ్యూల్ కూడా శాంతిని ఇష్టపడతాడు.అయితే రెండు కుటుంబాల మధ్య ఆస్తుల అంతరం చాలా ఉంటుంది. దానికి తోడు తాతల కాలం నాటి గొడవలు. దాంతో శాంతి నాన్న (ఆదిత్య మేనన్) శామ్యూల్‌ని మనుషుల్ని పెట్టి కొట్టిస్తాడు. శామ్యూల్ పొలాన్ని కూడా లాక్కుంటాడు. 'నువ్వు నా కంటే ఎక్కువ సంపాదించు, నాకంటే ఎక్కువ కీర్తి గడించు. అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా' అంటాడు. దాంతో డబ్బు సంపాదించడం కోసం శామ్యూల్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమా హీరో నాగార్జున (నాగార్జున)ని కలుస్తాడు. ఆ తరవాత ఏమైంది? శామ్యూల్ డబ్బునీ.. కీర్తినీ ఎలా సంపాదించాడు? తన ప్రేమని ఎలా సాధించాడు? అనేదే ఈ చిత్ర కథ.ఎలా ఉందంటే..? : ఓ టీనేజ్ లవ్ స్టోరీ ఇది. డబ్బున్న అమ్మాయి, పేదింటి అబ్బాయి ప్రేమ కథ. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూసేశాం. అయితే దర్శకుడు తనదైన ట్రీట్‌మెంట్‌తో కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ.. దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు. ప్రధమార్థం కొత్తగా అనిపించదు. శామ్యూల్ తన తెలివితేటల్ని ప్రదర్శించే సన్నివేశాలు మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే బాగుండేది. బీ పాజిటీవ్ రక్తాన్ని ఓ నెగిటీవ్‌గా మార్చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. కథానాయిక తండ్రి విసిరిన ఛాలెంజ్ కోసం కోట్లు సంపాదించడానికి ఓ పదహారేళ్ల కుర్రాడు సిటీకి బయల్దేరటం.. దాన్ని సాధించడం సినిమాటిక్‌గా అనిపిస్తాయి. తొలి భాగంలో స్నేహితుల మధ్య కొన్ని సరదా సన్నివేశాలు రాసుకోవాల్సింది.ద్వితీయార్థంలో నాగార్జున ఎంట్రీ ఇస్తారు. ఆయన చేసిన టీవీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను మళ్లీ చూపించారు. ఆ షో తాలుకూ సీన్లన్నీ 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమా నుంచి ప్రేరణగా పొంది రాసుకున్నవిగా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు అందరూ వూహించిన విధంగానే సాగాయి.ఎవరెలా చేశారంటే? : రోషన్.. శ్రియల జంట చూడముచ్చటగా ఉంది. రోషన్‌కి ఇదే తొలి సినిమా అంటే నమ్మబుద్ది కాదు. అందంగా ఉన్నాడు.. ఆకట్టుకొన్నాడు. శ్రియ ఎక్స్ ప్రెషన్స్ ముద్దుముద్దుగా ఉన్నాయి. చాలా చోట్ల శ్వేతాబసు ప్రసాద్ లా అనిపించింది. ఈ సినిమా కోసం నాగార్జున పడిన తపన కనిపిస్తుంది. ఇక.. ఎల్బీ శ్రీరాం కనిపించింది కాసేపే అయినా అందులో ఆయన నటన.. సంభాషణలు బాగున్నాయి. మిగిలిన వారిలో గుర్తు పెట్టుకోదగిన పాత్రలు పెద్దగా కనిపించవు.సాంకేతికంగా చూస్తే.. రోషన్ సాలూరి స్వరపరచిన బాణీలు బాగున్నాయి. కొత్త కొత్త భాష పాట ఆకట్టుకొంటుంది. కెమెరా తన వంతు కష్టపడింది. కథను ఎంపిక చేసుకోవటంలో దర్శకుడి తడబాటు.. సినిమా మీద కనిపిస్తుంది. అదొక్కటే ఈ సినిమాకున్న ఇబ్బంది. ప్రతిభావంతులైన నటులు.. సాంకేతిక నిపుణులు జట్టు కట్టటం బాగున్నా.. కథ దగ్గర మరింత శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది.
బలాలు
+ రోషన్.. శ్రియ.. నాగార్జున
+ కొత్త కొత్త భాష పాట
బలహీనతలు
-కథ, కథనం
చివరగా.. 'కాన్వెంట్' ఓకే అయినా చిక్కంతా 'సిలబస్'తోనే..
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







