ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!

- October 09, 2026 , by Maagulf
ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!

దోహా: ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కీలక నిబంధనలను ప్రవేశపెట్టింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడంతో పాటు డ్రైవింగ్ శిక్షణ సేవలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో సంబంధిత అధికారులతో కలిసి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. 2008లో అమల్లోకి వచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్టం నంబర్ 8 ఆధారంగా ఈ నిబంధనలు రూపొందించారు. ఖతార్‌లోని డ్రైవింగ్ స్కూళ్లతో పాటు డ్రైవింగ్ శిక్షణ తీసుకునే వినియోగదారులందరికీ ఇవి వర్తిస్తాయి.

కొత్త నిబంధనల ప్రకారం, స్పష్టమైన లిఖితపూర్వక ఒప్పందం లేకుండా డ్రైవింగ్ స్కూళ్లు వినియోగదారుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. ఒప్పందంలో అందించాల్సిన శిక్షణ సేవల వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.అలాగే, డ్రైవింగ్ శిక్షణ ప్రారంభమయ్యే వాస్తవ తేదీని కూడా ఒప్పందంలో తప్పనిసరిగా నమోదు చేయాలి.వినియోగదారులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ జారీ చేసే పర్మిట్ నంబర్‌ను పొందే అవకాశం కూడా డ్రైవింగ్ స్కూళ్లు కల్పించాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలకు అనుగుణంగా తమ విధానాలను సరిదిద్దుకునేందుకు డ్రైవింగ్ స్కూళ్లకు నోటీసు అందిన తేదీ నుంచి ఒక నెల గడువు ఇచ్చారు.గడువు ముగిసిన అనంతరం MoCI అధికారులు డ్రైవింగ్ స్కూళ్లలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.నిబంధనల ఉల్లంఘనలను గమనించిన వినియోగదారులు 16001 నంబర్‌కు ఫోన్ చేసి లేదా మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com