చిత్రసీమకు కొత్త శోభ

- September 21, 2016 , by Maagulf
చిత్రసీమకు కొత్త శోభ

నిత్య కల్యాణం పచ్చ తోరణం అంటారే... చిత్రసీమ పరిస్థితి అచ్చంగా అలానే ఉంది. ఏ సినిమాకి ఎన్ని లాభాలొస్తున్నాయి, డబ్బులు తెచ్చేవెన్ని? డిజాస్టర్‌ భారాలు మోస్తున్నవెన్ని? అనే లెక్కలు కాసేపు పక్కన పెడితే - కొత్త కథలు, కొత్త సినిమాలు, కొత్త కాంబినేషన్లతో చిత్రసీమకు కొత్త శోభ వచ్చింది. దాదాపుగా ప్రతీ కథానాయకుడూ ఏదో ఓ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నవారే.ప్రతీ కథానాయకుడి వెంట నలుగురైదుగురు దర్శకులు కథలతో క్యూలో ఉన్నారు. సినిమా పూర్తవ్వడం ఆలస్యం.. మరో సినిమాని పట్టాలెక్కించేయడమే ధ్యేయంగా దూసుకెళ్తున్నారు హీరోలంతా! ఓ వైపు కొత్త కథల వంటకం, మరో వైపు కొత్త కాంబినేషన్లతో ఎటు చూసినా హంగామానే కనిపిస్తోంది.
ఇదివరకు పరిస్థితి వేరు. దర్శకుడు ఓ కథ సిద్ధం చేసుకొని తగిన కథానాయకుడి దగ్గరకు వెళ్లేవాడు. ఆ తరవాత పరిస్థితి మారింది. ఎవరి చేతిలో విజయం ఉందో.. వాళ్లతో సినిమాలు చేయడం మొదలెట్టారు కథానాయకులు. కొంతకాలం స్టార్‌ దర్శకుల హవానే నడిచింది. ఇప్పుడు వాళ్లకు దీటుగా కొత్త దర్శకులు వస్తున్నారు. భుజం తట్టి ప్రోత్సహించాలే గానీ.. అద్భుతాలు సృష్టించగలం అని నిరూపించుకొంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో స్టార్లుగా మారుతున్నవాళ్లూ ఉన్నారు. సహాయ దర్శకుల్ని ప్రోత్సహించడంలో మన కథానాయకులు ఎప్పుడూ ముందే ఉంటారు. రచయితలుగా సంచలనం సృష్టిస్తున్నవాళ్లంతా క్రమంగా మెగాఫోన్లు పడుతున్నారు. డాన్స్‌మాస్టర్లు, కెమెరామెన్లు కెప్టెన్‌ కుర్చీ వైపే చూస్తున్నారు. దాంతో దర్శకుల జాబితా పెరుగుతూ వస్తోంది. కథానాయకులకు ఆప్షన్లు ఎక్కువయ్యాయి. వెతకాలే గానీ కావల్సినన్ని కథలు దొరికేస్తాయి. అందుకే కథానాయకులూ వేగం పెంచి సినిమాలు చేస్తున్నారు.
మహేష్‌బాబు కోసం ఓ పెద్ద క్యూనే ఉంది. మురుగదాస్‌ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ సినిమా పట్టాలెక్కుతుంది. త్రివిక్రమ్‌, వంశీ పైడిపల్లి, గౌతమ్‌ మేనన్‌ ఎప్పటి నుంచో మహేష్‌ కోసం ఎదురుచూస్తున్నారు. రాజమౌళి - మహేష్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విక్రమ్‌ కె.కుమార్‌లాంటి తమిళ దర్శకులు కూడా మహేష్‌ కోసం కథలు సిద్ధం చేసుకొన్నారు. మరో ఐదేళ్ల వరకూ మహేష్‌ కాల్షీట్లు ఖాళీ లేనట్టే. రామ్‌చరణ్‌ పరిస్థితీ అంతే. 'ధృవ' పూర్తయ్యాక సుకుమార్‌ సినిమా మొదలవుతుంది. మణిరత్నం, సంపత్‌నంది, మేర్లపాక మురళి, గౌతమ్‌ మేనన్‌ వీళ్లంతా చరణ్‌ కోసం ఎదురుచూస్తున్నవాళ్లే. సుకుమార్‌ తరవాత రామ్‌చరణ్‌ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తిగా మారింది.అల్లు అర్జున్‌ కూడా దర్శకుల్ని బాగానే ఆకర్షిస్తున్నాడు. లవ్‌ స్టోరీలు, యాక్షన్‌ డ్రామాలు ఏవైనా చేయగల సమర్థుడు బన్నీ. అందుకే బన్నీ కోసం వైవిధ్యభరితమైన కథలు పుడుతున్నాయి. 'సరైనోడు' తరవాత లింగుస్వామి, విక్రమ్‌ కె.కుమార్‌... ఇద్దరి పేర్లు వినిపించాయి. అనూహ్యంగా హరీష్‌ శంకర్‌ ఆ అవకాశం అందుకొన్నాడు. అయితే లింగుస్వామితోనూ విక్రమ్‌తోనూ బన్నీ భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేస్తాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బాబి కూడా బన్నీకి ఓ కథ చెప్పాడని సమాచారం. 'దువ్వాడ జగన్నాథమ్‌' తరవాత వీళ్లలో ఎవరి సినిమానైనా సరే పట్టాలెక్కించొచ్చు. 'బాహుబలి' కోసం ప్రభాస్‌ ఏకంగా మూడేళ్ల కాల్షీట్లు కేటాయించేశాడు. ప్రభాస్‌ ఎప్పుడు వస్తాడా.. అనుకొంటూ చాలామంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి 2' తరవాత సుజిత్‌ సినిమా పట్టాలెక్కేస్తుంది. 'మిర్చి' కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని చెప్పుకొంటున్నారు. త్రివిక్రమ్‌ - ప్రభాస్‌ల కాంబో కూడా చర్చల్లో ఉంది. ప్రభాస్‌ కూడా యేడాదికి రెండు సినిమాల చొప్పున చేయాలని వ్యూహాల్ని రచిస్తున్నాడట. కథల తాకిడి ఆ స్థాయిలో ఉంది.'జనతా గ్యారేజ్‌' తరవాత ఎన్టీఆర్‌ సినిమా ఏంటన్నది ఇంత వరకూ తేలలేదు. కథల్లేక కాదు. ఎలాంటి కథని ఎంచుకోవాలో అర్థం కాకే ఈ ఆలస్యం. ఎందుకంటే ఎన్టీఆర్‌ చుట్టూ నలుగురు దర్శకులు తిరుగుతున్నారు. ఆయన ఎవరిని ఓకే చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. పూరి జగన్నాథ్‌, లింగుస్వామి, వక్కంతం వంశీ, త్రివిక్రమ్‌... ఇలా రోజుకో పేరు వినిపిస్తోంది. 'గ్యారేజ్‌' తరవాత సినిమా ఏంటన్నది మరో వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. వీళ్లే కాదు.. నాగచైతన్య, అఖిల్‌, నాని, శర్వానంద్‌.. వీళ్లంతా బిజీ హీరోలే. వాళ్ల కోసం కూడా కథలు పోటీ పడుతున్నాయి. ఏ కాంబినేషన్‌ అయినా ఎప్పుడైనా సరే.. పట్టాలెక్కేయొచ్చు.ఇది వరకు కథల్లేవన్న మాట ఎక్కువగా వినిపించేది. ఇప్పుడు అలా చెప్పి తప్పించుకొనే పరిస్థితి కనిపించడం లేదు. కథానాయకులు తమ పంథా మార్చి కొత్త తరహా సినిమాల్ని చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఎలాంటి అంచనాలూ లేకుండా సినిమాల్ని చూడ్డానికి ఇష్టపడుతున్నారు. అందుకే.. అనూహ్యమైన విజయాలు సొంతం అవుతున్నాయి. తెలుగు చిత్రసీమ ప్రస్తుతం ఓ కీలకమైన దశలో ఉందన్నది విశ్లేషకుల మాట. ఎక్కువ సినిమాలొస్తున్నాయి.. అందులో విజయాలూ దక్కుతున్నాయి. దాంతో భవిష్యత్తు మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com