సిడ్నీ లిటిల్ లైవ్స్ పోటీల్లో ప్రతిభ కనపరచిన భారత సంతతి...

- September 21, 2016 , by Maagulf
సిడ్నీ లిటిల్ లైవ్స్ పోటీల్లో ప్రతిభ కనపరచిన భారత సంతతి...

భారత సంతతి చిన్నారులు సిడ్నీ లిటిల్ లైవ్స్ ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ చాటారు. 20 మంది ఫైనలిస్టుల్లో భారత సంతతికి చెందిన ఆరేళ్ళ అలెక్స్ సక్సేనా, పదకొండేళ్ళ అనన్య వఖారే ఉన్నారు. వీరు తీసిన చిత్రాలను డిజిటల్‌ ఎన్‌లార్జ్‌మెంట్ ద్వారా 1.5 మీటర్లకు పెంచి హైడ్ పార్క్‌లోని సండ్రింఘమ్ గార్డెన్స్‌లో వచ్చే నెల 9 వరకు ప్రదర్శిస్తారు. 'ఆర్ట్ అండ్ అబౌట్ ప్రోగ్రామ్'లో ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తారు. ఆస్ట్రేలియన్ లైఫ్, సిడ్నీ లిటిల్ లైవ్స్‌ పేరుతో ప్రతి సంవత్సరం ఈ పోటీలు జరుగుతాయి. 3-11 ఏళ్ళ వయసు బాలలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తారు.

సిడ్నీ నగర జీవితాలను బాలలు తమ ఆధునిక దృక్పథంతో కెమెరాలో బంధించి, ఈ పోటీల్లో ప్రదర్శిస్తారు. ఈ ఏడాది జరిగిన సిడ్నీ లిటిల్ లైవ్స్ పోటీలకు మొత్తం 250 చిత్రాలు వచ్చాయి. వీటి నుంచి 20 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. అలెక్స్, అనన్య చిత్రాలు సృజనాత్మకంగా, సిడ్నీ నగరాన్ని బాలల దృష్టితో ప్రత్యేకంగా చూస్తున్నట్లు ఉన్నాయని జడ్జీలు ప్రశంసించారు.

అలెక్స్ సక్సేనా తన చిత్రానికి 'కీపింగ్ ఆస్ట్రేలియా సేఫ్' (ఆస్ట్రేలియాను సురక్షితంగా ఉంచడం) అని పేరు పెట్టాడు. నేరాలు, ప్రపంచ ఘర్షణల గురించి ఓ చిన్నారి ఎలా ఆలోచిస్తాడు, వాటితో ఎలా పోరాడవచ్చు అనే అంశాలను ఈ చిత్రం ద్వారా వివరించాడు. ప్రస్తుత ప్రపంచ వాతావరణం పట్ల బాలలు ఎలా స్పందిస్తున్నారో అద్భుతంగా చిత్రించాడు. దీనిని సిడ్నీ లిటివ్ లైవ్స్ ప్రమోషనల్ మెటీరియల్‌గా ఉపయోగిస్తున్నారు.

ఆరేళ్ళ వయసున్న అలెక్స్‌కు ఆసక్తికరమైన, అర్థవంతమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. తనకు పెద్ద కెమెరాలంటే చాలా ఇష్టమని, అవి తనకు ఉత్తేజాన్ని ఇస్తాయని చెప్పాడు. రెండేళ్ళ క్రితం తన అక్క ఈ పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలవడంతో ఆమె నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు చెప్పాడు. పదకొండేళ్ళ అనన్య వఖారే గతంలో మరిక్‌విల్లే అర్బన్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌లో అవార్డు సాధించింది.

సిడ్నీ సాంస్కృతిక, ఆర్కిటెక్చురల్ వైవిధ్యాన్ని వివరించే చిత్రం 'డైవర్స్ సిడ్నీ' ఆమెకు తుది పోటీదారుల్లో స్థానం కల్పించింది. ఇటీవలి కాలంలో సుస్థిరత దిశగా సిడ్నీ పయనిస్తున్న తీరును కూడా ఈ చిత్రంలో వివరించింది. స్పైస్ అల్లేని సందర్శించిన ప్రతిసారీ అక్కడి విభిన్నమైన దృశ్యాలు తనకు ఆకర్షణీయంగా కనిపిస్తాయని అనన్య చెప్పింది. సెంట్రల్ పార్క్ బ్యాక్‌డ్రాప్‌లొ అలంకరణలు తనకు చాలా నచ్చుతాయని చెప్పింది.

కాంపిటీషన్ జడ్జి లూయిస్ వెలాన్ మాట్లాడుతూ లిటిల్ లైవ్స్ ఫొటోగ్రాఫర్స్‌కు ఉన్న పరిపక్వమైన విజువల్ లిటరసీ స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు. యువ ఫొటోగ్రాఫర్లు ఇతరుల గురించి, ఇతర విషయాల గురించి అర్థం చేసుకోగలిగిన సామర్థ్యాన్ని, బుద్ధి సూక్ష్మతను కనబరుస్తుండటం అత్యంత హర్షణీయమని తెలిపారు. కుటుంబ సంబంధాల గురించి అద్భుతంగా తమ చిత్రాల్లో వివరించారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com